Jio New Phone: రిలయన్స్ జియో మనదేశంలో జియో భారత్ ఫీచర్ ఫోన్లతో కూడా 4జీ కనెక్టివిటీ, యూపీఐ సపోర్ట్, యాప్స్ సపోర్ట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో భారత్ సిరీస్‌లో జియో భారత్ వీ2, జియో భారత్ కే1 కార్బన్, జియో కార్బన్ బీ1 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఐటెల్, లావా, నోకియా కంపెనీలతో కూడా జియో భారత్ 4జీ హ్యాండ్ సెట్ల కోసం జియో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉన్న 25 కోట్ల 2జీ వినియోగదారులను 4జీకి మార్చాలన్నది జియో లక్ష్యంగా తెలుస్తోంది.
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం... ఐటెల్, లావా, నోకియా కంపెనీలతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ జియో ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ తెలిపారు. యూపీఐ పేమెంట్స్, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ ఉన్న 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.999కే లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు చేస్తుంది.
ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న జియో భారత్ వీ2 ధర రూ.999గా ఉంది. జియో భారత్ కే1 కార్బన్‌ను కూడా రూ.999కే కొనుగోలు చేయవచ్చు. జియో భారత్ బీ1 ఫోన్ ధరను రూ.1,299గా నిర్ణయించారు. యూపీఐ, జియో యాప్స్ సపోర్ట్‌తో ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
జియో భారత్ వీ2 4జీ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. జియో సినిమా, జియో సావన్, జియో పే సర్వీసులను జియో భారత్ వీ2 4జీ ద్వారా ఉపయోగించవచ్చు. దీని వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ వీజీఏ కెమెరా అందుబాటులో ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫీచర్ ఫోన్ అందించనుంది. దీని స్టోరేజ్ చాలా మినిమల్‌గా ఉంటుంది. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 ఎంబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు కార్బన్ లోగోను వేశారు.
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లు
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను కంపెనీ అందించనుంది. ఇదే లాభాలతో వార్షిక ప్లాన్ కావాలనుకుంటే రూ.1,234తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
మరోవైపు రిలయన్స్ జియో మోస్ట్ అవైటెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ 5జీకి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. జియో ఫోన్ 5జీ ఇమేజ్ ఇటీవలే ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఈ సంవత్సరం దీపావళికి ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని కూడా గతంలో వార్తలు వచ్చాయి. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. లీకైన ఫోటోలో ఫోన్ వెనుక ప్యానెల్, ముందువైపు డిజైన్‌ను క్లియర్‌గా చూడవచ్చు. ఇంతకు ముందు కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయింది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?