రిలయన్స్ జియో రిటైల్ కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) డివైస్‌ను లాంచ్ చేయనుంది. జియో ఎయిర్‌ఫైబర్ మార్కెట్ రేటు కంటే 20 శాతం వరకు తగ్గింపుతో లాంచ్ కానుంది. ఈ వైర్‌లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ పరికరం (జియో ఎఫ్‌డబ్ల్యూఏ) వినియోగదారుల మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ డివైస్‌ను ఆగస్టు 28వ తేదీన లాంచ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వైర్ అవసరం లేకుండా ఇంటికి వైఫై పెట్టించుకోవచ్చన్న మాట.


మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం డేటా టాప్ ప్యాక్ తర్వాత 5జీ నుంచి సంపాదించడానికి జియో చేస్తున్న ప్రధాన ప్రయత్నం ఇదే. ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం రాబోయే ఏజీఎం (వార్షిక సాధారణ సమావేశం) సమయంలో ఈ లాంచ్‌ను చూడవచ్చని తెలుస్తోంది. జియో ఇప్పటివరకు లాంచ్ చేసిన డివైస్‌లన్నీ గొప్ప ఆఫర్‌లతోనే మార్కెట్లోకి వచ్చాయి. జియో లాంచ్ చేయనున్న ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ భిన్నంగా ఏమీ ఉండదు. 


రిలయన్స్ జియో తన 5జీ రోల్‌అవుట్ పూర్తయిన,స్టెబిలైజ్ అయిన నగరాల్లో కస్టమర్ ట్రయల్స్ ప్రారంభించినట్లు సమాచారం. లాంచ్ కోసం సన్నాహకంగా ఇంటి వాతావరణంలో ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన కొంత మంది ఉద్యోగులకు డివైస్‌ను కూడా పంపిందని తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం జియో ఎఫ్‌డబ్ల్యూఏ డివైస్ వివిధ 5జీ ఎయిర్‌వేవ్‌లను ఉపయోగించి డేటా పాత్‌వేని సృష్టించే క్యారియర్ అగ్రిగేషన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. ఇందుకోసం గతేడాది వేలంలో 700 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్‌లను టెల్కో కొనుగోలు చేసింది.


ఇప్పటికే లాంచ్ చేసిన ఎయిర్‌టెల్
భారతి ఎయిర్‌టెల్ తన ఎఫ్‌డబ్ల్యూఏ డివైస్ అయిన ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌ను ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ నెలలో ప్రారంభించింది. ఈ డివైస్ ధర రూ. 2,500గా ఉంది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 799గా ఉంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఆరు నెలల బ్లాక్‌లలో మాత్రమే సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. అంటే వినియోగదారులు ప్రారంభంలో కనీసం రూ.7,300 ఖర్చు చేయాలన్న మాట.


స్వీడిష్ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఎరిక్సన్ ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో 2022 సంవత్సరంలో 10 కోట్ల ఎఫ్‌డబ్ల్యూఏ కనెక్షన్‌లు ఉన్నాయి. 2028 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 300 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. దీనిలో 80 శాతం కనెక్షన్లు 5జీ కనెక్టివిటీని ఉపయోగిస్తాయని అంచనా.






Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial