Muthireddy Yadagiri Reddy: బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం (ఆగస్టు 24) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం కొమురవెల్లిలో ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం, కేసులు అంటే తెలవని వాళ్లు టిక్కెట్ కావాలంటూ ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఆస్తుల్ని అమ్మి తెలంగాణ కోసం పని చేశానని అన్నారు. సీఎం దగ్గర ఉంటానని చెప్పుకునే కొందరు కార్పొరేట్ శక్తులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 


తాను చెబితేనే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని, తాను చెబితేనే వీఆర్‌ఏలను రెగ్యులర్ చేశారని, తాను ఒక్కడినే 50 లక్షల సభ్యుత్వాలు చేశానని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నారని ముత్తిరెడ్డి విమర్శించారు. ఓ ఆడబిడ్డ ఆస్తిని కబ్జా చేసిన చరిత్ర పల్లా దేనని మండిపడ్డారు. రాష్ట్రం, దేశం మెచ్చిన మేధావి కేసీఆర్‌, ఆయనకు సలహాలు ఇచ్చే స్థాయి పల్లాకు ఉందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సారథ్యంలో తామంతా పని చేస్తున్నామని హరీష్ రావు, మంత్రులు, పార్టీ నేతలు చెబుతుంటే పల్లా మాత్రం అంతా తన ఘనత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. 


పల్లా మాటలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కళంకమని ముత్తిరెడ్డి అన్నారు. జనగామలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో పల్లాకు తెలియదని, ఒక్కరోజైనా ప్రజల్లోకి వచ్చారా? అలాంటి వాళ్లు ప్రజలకు సేవ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జనగామ అభివృద్ధిలో పొగడ్తలు అందుకుంటూ ఉంటే, అభివృద్ధి కాలేదనడం అవివేకం అన్నారు. ముఖ్యమంత్రి ఇంకా టిక్కెట్ ప్రకటించకుండానే తనకు కేటాయించినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు.? సీఎం కేసీఆర్ ఏమైనా పల్లా చెవిలో చెప్పారా అంటూ ముత్తిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


వీడని పీటముడి


జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటుపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు.


జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు.


ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్‌ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్‌ 1న కేటీఆర్‌ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.