North Korea Spy Satellite: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహం పంపాలనుకున్న వారి ప్రయోగం విఫలమైంది. గురువారం ఈ విషంపై అక్కడి మీడియా ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగం చేపట్టి విఫలమైంది. బ్లాస్ట్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే రాకెట్ సముద్రంలో కూలిపోయింది. నెలల వ్యవధిలోనే మరోసారి విఫలమైంది.
మాలిగ్‌యాంగ్-1 అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్న చోలిమా-1 అనే రాకెట్ ను ఆగస్టు 24 న నార్త్ కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయోగించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ప్రయోగం మొదటి, రెండవ దశలు విజయవంతమయ్యాయి. కానీ మూడవ దశలో ఎమర్జన్సీ బ్లాస్టింగ్‌లో లోపం కారణంగా మిషన్ మూడో దశలో విఫలమైనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రయోగం విఫలం కావడానికి తలెత్తిన సమస్య అంత పెద్దదేమీ కాదని, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత అక్టోబరులో మూడో సారి ప్రయోగం చేపడతామని అధికారులు వెల్లడించినట్లు పేర్కొంది.
దక్షిణ కొరియా వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. తెల్లవారు జామున 3.50 గంటల సమయంలో ఎల్లో సీ మీదుగా నార్త్ కొరియా రాకెట్‌ను ప్రయోగించింది. తాము అంతరిక్ష ప్రయోగ వాహనాన్ని లాంచ్ చేసినట్లు నార్త్‌కొరియా చెప్తున్నట్లు తెలిపారు. తమ సైన్యం ఎల్లప్పుడూ పూర్తి సంసిద్ధతో ఉంటుందని, అమెరికాతో సమన్వయం చేసుకుంటూ నార్త్‌కొరియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సెక్యురిటీని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయోగానికి ముందు జపాన్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని, నార్త్ కొరియా నిషేధిత బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని ఉపయోగిస్తోందని, జపాన్‌లోని ఒకినావా సమీపంలో జపాన్ గగనతలం నుంచి రాకెట్ వెళ్లినట్లు తెలిపిందని వెల్లడించారు.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలు, రహస్య ఉపగ్రహాలు ఇలా రకరకాల అంతరిక్ష ప్రయోగాలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నా కిమ్ అంతరిక్ష ప్రయోగాలు, మిలిటరీ గొప్పలు అధికంగా ఉంటాయి. మిలిటరీ కోసం ఆ దేశం అధికంగా ఖర్చు చేస్తుంది. ఉత్తర కొరియా గత ఏడాది ఏకంగా 70 కి పైగా క్షిపణులను ప్రయోగించింది. అంతేకాకుండా ఇటీవల కొత్త క్షిపణి లాంచర్లను ప్రదర్శించింది.