Brics Summit 2023: బ్రిక్స్ (BRICS-బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలోకి కొత్తగా 6 దేశాలను సభ్యులుగా చేర్చుకున్నారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రస్తుతం ఛైర్ లో ఉన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ మేరకు ప్రకటించారు. బ్రిక్స్ కూటమిలో చేరేందుకు 6 దేశాలు ( అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ) ఇప్పటికే అంగీకారం వ్యక్తం చేయగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిని విస్తరించడం ఇది రెండోసారి. ఈ కూటమిలో 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు ఉండగా.. 2010లో సౌతాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామి అయింది. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ జీడీపీలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ వాటాను ఈ కూటమిలోని దేశాలు అందిస్తాయి. 2010 తర్వాత బ్రిక్స్ కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి. 


బ్రిక్స్ కూటమిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను చేర్చుకోవడం అభినందిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమిని ఆయన ముఖ్యమైన సమూహంగా అభివర్ణించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రజల శ్రేయస్సు, గౌరవం, ప్రయోజనాల కోసం సహకారం అందివ్వడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు. 


కూటమిలోకి కొత్త సభ్యులను చేర్చుకోవడం వల్ల బలోపేతం అవుతుందని భారత్ ఎప్పుడూ విశ్వసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 15వ బ్రిక్స్ సమ్మిట్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. 'బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. కూటమిలోకి కొత్త సభ్యులను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ సంస్థగా బలోపేతం అవుతుందని బారత్ ఎప్పుడూ విశ్వసిస్తుంది' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడ్రోజుల పాటు జరిగిన సదస్సులో ఎన్నో సానుకూల ఫలితాలు వచ్చాయని మోదీ ప్రశంసించారు. 'ఈ 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో చాలా సానుకూల ఫలితాలు వెలువడినందుకు నేను సంతోషిస్తున్నా' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.


Also Read: ప్రతి వ్యక్తికి లింగమార్పిడి చేయించుకునే హక్కు ఉంది: అలహాబాద్‌ హైకోర్టు


అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను పూర్తి సభ్యులుగా ఆహ్వానిస్తూ దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌ డిక్లరేషన్ 2ను గ్రూప్ ఆమోదం తెలిపినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, బ్రిక్స్ ఛైర్ సిరిల్ రమఫోసా ప్రకటించారు. ఈ కొత్త దేశాలు జనవరి 1వ తేదీ 2024 నుంచి బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మారతాయి.