Allahabad High Court : ప్రతి వ్యక్తికి కూడా లింగ మార్పిడి చేయించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. సర్జరీ ద్వారా తమ లింగాన్ని మార్చుకునే అవకాశం ప్రతి వ్యక్తికి ఉందని, అది రాజ్యాంగం ద్వారా అందించిన హక్కు అని పేర్కొంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన అప్లికేషన్‌పై యూపీ డీజీపీ నిర్ణయం తీసుకునే అంశంపై అలహాబాద్ హైకోర్టు పై విధంగా స్పందించింది. ప్రతి వ్యక్తికి ఈ హక్కు ఉందని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆమె అవివాహిత. తనను తాను పురుషుడిగా గుర్తించే విధంగా సర్జరీ చేయించుకొని పూర్తి పురుషుడిగా మారాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. తాను జండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు కూడా ధ్రువీకరించారని పిటిషనర్ వెల్లడించారు. దిల్లీలో ధ్రువీకరించిన సైకాలజిస్ట్ దగ్గర సైకాలజీ పరీక్ష చేయించుకున్నానని వారు ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపారు. లింగ మార్పిడి చేయించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ఇది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. లింగ గుర్తింపు అనేది వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించిన తన పిటిషన్ డీజీపీ వద్ద మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషన్ లో తెలిపారు.
పిటిషన్ వేసిన మహిళ జండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ అజిత్ కుమార్ పేర్కొన్నారు. చూడడానికి మహిళలా ఉన్నా తన ఫీలింగ్స్, ఆలోచనలు పురుషుడిలా ఉన్నాయని తెలిపారు. కాబట్టి తన ఆలోచనలకు, తన ఫిజికల్ బాడీకి మిస్‌మ్యాచ్ అవుతోందని ఇలాంటి వ్యక్తులకు రాజ్యాంగం ప్రకారం సర్జరీ ద్వారా లింగ మార్పిడి చేయించుకునే హక్కు ఉందని అన్నారు.
ఈ ఆధునిక సమాజంలో మనం హక్కును గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే కేవలం జండర్ ఐడెంటిటీ డిసార్డర్ సిండ్రోమ్‌ను మాత్రమే ప్రోత్సహించినట్లువుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించకపోతే.. సదరు వ్యక్తి చాలా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. డిసార్డర్స్, ఆందోళ, తనే తనకు నచ్చకపోవడం, నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్, డిప్రెషన్ లాంటి ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు సర్జరీ ద్వారా లింగ మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
డీజీపీ ఈ పిటిషిన్‌ను పెండింగ్‌లో పెట్టేందుకు సమర్థమైన కారణాలేమీ కనిపించలేదని కోర్టు ఆగస్టు 18 న జరిగిన విచారణలో వెల్లడించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఏదానై చట్టాన్ని రూపొందించారా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. అలా ఉంటే దానిని రికార్డ్స్‌లోకి తీసుకురావాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబరు 21కి వాయిదా వేసింది.