iPhone 16 Blinkit: ఐఫోన్ 16 సిరీస్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. శుక్రవారం నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన విక్రయాలు మొదలయ్యాయి. ముంబైలోని యాపిల్ బీకేసీ స్టోర్, ఢిల్లీలో ఉన్న యాపిల్ సాకేత్ స్టోర్లలో ఈ సేల్ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో కూడా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ వంటి హైపర్‌లోకల్ డెలివరీ ప్లాట్‌ఫాంల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. కొన్ని నగరాల్లో వీటి ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీని పొందవచ్చు. వీటితో పాటు ఐఫోన్ 16పై పలు డిస్కౌంట్లను కూడా ఇవి అందిస్తున్నాయి.
బ్లింకిట్... 10 నిమిషాల్లోనే...
ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేస్తే 10 నిమిషాల్లోనే డెలివరీ కానుంది. దీని కోసం బ్లింకిట్... యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ అయిన యూనికార్న్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. ఐదు వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 16 సిరీస్ సేల్స్‌ను ప్రారంభించినట్లు బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు ఆల్బిందర్ ధిండ్సా తెలిపారు. బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఏకంగా 295 ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను కూడా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
టాటా డిజిటల్‌కు చెందిన బిగ్ బాస్కెట్ కూడా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డెలివరీ కోసం క్రోమా ఎలక్ట్రానిక్స్‌తో (ఇది కూడా టాటా గ్రూపునకు చెందిన సంస్థే) భాగస్వామ్యం ఏర్పరచుకుంది. దీని ద్వారా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను వినియోగదారులు 10 నిమిషాల్లోనే డెలివరీ పొందవచ్చు. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై నగరాల్లో ఈ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో ఉంది. బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ హరి మీనన్ తెలుపుతున్న దాని ప్రకారం బిగ్ బాస్కెట్ ఐఫోన్ 16 సిరీస్ మొదటి ఆర్డర్‌ను ఏడు నిమిషాల్లోనే డెలివరీ చేసింది.
ఐఫోన్ 16 ధర (iPhone 16 Price in India)
ఐఫోన్ 16లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.89,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,09,900గానూ నిర్ణయించారు. బ్లాక్, పింక్, టియల్, అల్ట్రామెరైన్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ ధర (iPhone 16 Plus Price in India)
ఐఫోన్ 16 ప్లస్‌కు సంబంధించి 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900గా నిర్ణయించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900గానూ ఉంది. ఐఫోన్ 16 తరహాలోనే దీన్ని కూడా బ్లాక్, పింక్, టియల్, అల్ట్రామెరైన్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే