Telangana News: తెలంగాణలో సంక్షేమ పథకాలు అన్నింటినీ అర్హులకు మాత్రమే అందజేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురాబోతోంది. ఒక్క సంక్షేమ పథకాలే కాకుండా అన్ని ప్రభుత్వ చేపట్టే సంక్షమ కార్యక్రమాలన్నీ కూడా దానికే అనుసందానం చేయబోతోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆదివారం నాడు సమావేశమైంది. ఈ భేటీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ కార్డులు తీసుకొస్తామన్నారు రేవంతం రెడ్డి. ప్రజల కోసం చేపట్టే ప్రతి కార్యక్రమం ఆ డిజిటల్ కార్డుకు అనుసంధానిస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి ఓ కార్డు ఉంటుందని తెలిపారు. ఈ కార్డు ద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ పథకం, పని జరుగుతుందని పేర్కొన్నారు. అంటే రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, కల్యాణ లక్ష్మీకార్డు అన్ని కూడా ఈ కార్డు ద్వారానే ఇస్తామని పేర్కొన్నారు.
పథకాల అందజేసే కార్డుతోపాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వబోతుమన్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రతి వ్యక్తికీ ఒక్కో కార్డు ఇస్తామని వివరించారు. ఆ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ ఉంటుందని వెల్లడించారు. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరితే దాని ఆధారంగానే చికిత్స ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి - అభినందనలు తెలిపిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
బీసీ, ఎస్సీ రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు రేవంత్ రెడ్డి. జనభాగణన పూర్తి అయితేనే బీసీ రిజర్వేషన్‌పై నిర్ణయం తీసుకోగలమని తేల్చి చెప్పారు. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్‌లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామన్న రేవంత్... దీనిపో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీ పరిశీలన చేస్తోందని వివరించారు.
మరోవైపు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధి పని చేస్తుందని రేవంత్ తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు 9 నెలల్లో ప్రజలకు ఇచ్చామన్నారు. అయినా ప్రతిపక్షం బురదజల్లుతోందని వాటిని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి పనిలో ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్యం చేసుకోవడంతో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఒడించారని గుర్తు చేశారు. ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు గుంపుగా సెక్రటేరియట్‌కు రావద్దన్నారు రేవంత్.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాల్సిన టైంలో మహేష్‌గౌడ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారని ఆయనకు అందరం సహకరించాలని కోరారు. ఏదో చేసి నాలుగోసారి కూడా అధికారంలోకి రావాలని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కష్టపడే వాళ్లకు గుర్తింపు ఉంటుందనేందుకు ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవులే నిదర్శనం అన్నారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రేవంత్ హితవుపలికారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు వారినికి రెండు సార్లు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. ప్రతి లీడర్ చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు.
Also Read: 'స్కిల్ యూనివర్సిటీ' పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు - విధివిధానాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం