Guinness World Record @ Chiru: మెగాస్టార్ చిరంజీవి.. తన 45 ఏళ్ల కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్‌మెంట్స్ చేసినందుకు.. ఆయనకు గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. చిరంజీకి ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.


డాన్స్‌పై ఉన్న ఇష్టమే తనను ఇక్కడి వరకూ తీసుకొచ్చిందన్న మెగాస్టార్‌:


            మెగాస్టార్ చిరంజీవి తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో .. 156 సినిమాల్లో 537 పాటల్లో దాదాపు 24 వేలకు పైగా వివిధ డాన్స్ మూవ్‌మెంట్స్ చేశారు. ఇందుకు గానూ గిన్నీస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఆయనకు చోటు దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో.. అమిర్‌ఖాన్ చేతుల మీదగా గిన్నీస్ బుక్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డు ను అందించారు. చిన్న నాటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమన్న చిరంజీవి.. చిన్నతనంలో రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేసేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఎన్‌సీసీలో చేరిన తర్వాత.. రాత్రిళ్లు భోజనం ప్లేట్‌తో దరువేస్తూ డాన్స్ చేసేవాడినని నాటి రోజులను చిరంజీవి జ్ఞాపకం చేసుకున్నారు.


డాన్స్ చేస్తూ పడి కాలుకు దెబ్బతగిలితే.. ఆ తర్వాత వేసిన స్టెప్పులునాగిని డాన్స్‌గా మారాయని చిరంజీవి చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనను సావిత్రి, రోజారమణి, నరసింహరాజు ప్రోత్సహించారని.. వారి ప్రోద్బలంతోనే ప్రాణం ఖరీదు సినిమాలో డైరెక్టర్‌ క్రాంతికుమార్ నా కోసం ఓ డ్యూయెట్ పెట్టీ స్టెప్పులు వేయించడంతో తన ప్రయాణం ఇక్కడి వరకూ వచ్చిందన్నారు. పునాదిరాళ్లు సినిమాతో నా డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. నిర్మాత అశ్వనీదత్‌ అల్లు అరవింద్ ప్రతి సినిమాలో ఆరు పాటలు ఉండేలా చూసే వాళ్లని వారితో పాటు తనతో పనిచేసిన దర్శక నిర్మాతలకు, హీరోయిన్లకు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.


చిరంజీవికి నేను అభిమానిని: అమీర్‌ఖాన్‌


            ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన అమీర్‌ఖాన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిర్‌.. తాను చిరంజీవికీపెద్ద అభిమానిని అని తెలిపారు. ఆయన ఈ కార్యక్రమానికి రావాలని రిక్వెస్ట్ చేస్తే.. తాను ఆర్డర్ వేయండన్నానని చిరుపై తన అభిమానాన్ని అమిర్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రతి పాటకు ప్రాణం పెట్టి డ్యాన్స్ వేస్తారని, ఆయన తన సోదర సమానులని అమిర్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో అశ్వనీదత్‌, రాఘవేంద్రరావుతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు.


చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు:


            గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలుగు వారి గర్వించదగ్గ అంశంగా పేర్కొన్నారు. చిరంజీవికి గిన్నీస్‌ బుక్‌లో చోటు లభించడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిరంజీవి తన గ్రేస్‌తో తెలుగు సినిమాను మరో ఎత్తులకు తీసుకెళ్లడంతో తిరుగులేని కృషి చేశారని అన్నారు.