Indian Telecom Sector: భారతీయ వినియోగదారులు వైర్‌లెస్ సర్వీసుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే క్రమంగా భారతదేశంలో వైర్‌లెస్ యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నివేదిక ప్రకారం భారతదేశం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో పెరుగుదలను చవి చూసింది. 2024 జనవరి చివరి నాటికి మొత్తం వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 1.16 బిలియన్లకు చేరుకుంది. అంటే 116 కోట్లకు పైగానే అన్నమాట. 2023 డిసెంబర్‌లో భారతదేశంలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.158 బిలియన్లుగా ఉంది. దీని అర్థం ప్రస్తుతం దాని వృద్ధి రేటు 0.19 శాతంగా ఉంది.


జియోనే నంబర్ వన్‌గా...
కొత్త ట్రాయ్ డేటా ప్రకారం జియో జనవరిలో 41.78 లక్షల (4.178 మిలియన్) కొత్త మొబైల్ వినియోగదారులను పొందింది. ఈ విషయంలో టెలికాం ఇండస్ట్రీలోనే నంబర్ వన్‌గా నిలిచింది. దీని కారణంగా మొత్తం జియో కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 46.39 కోట్లకు పెరిగింది.


భారతీ ఎయిర్‌టెల్ వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. భారతి ఎయిర్‌టెల్ జనవరిలో 7.52 లక్షల (0.752 మిలియన్) కొత్త మొబైల్ వినియోగదారులను పొందింది. ఇది జియో కంటే 5-6 రెట్లు తక్కువ. దీని కారణంగా ఎయిర్‌టెల్ మొబైల్ వినియోగదారుల సంఖ్య ఇప్పుడు 38.24 కోట్లకు (382.4 మిలియన్లు) పెరిగింది.


వొడాఫోన్ ఐడియా భారతదేశంలో మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీ. అయితే ఈ కంపెనీ నిరంతరం నష్టాలను ఎదుర్కొంటోంది. 2024 జనవరిలో కూడా ఈ కంపెనీలో కొత్త కస్టమర్లు చేరడం సంగతి పక్కన పెడితే పాత కస్టమర్లు కూడా వెళ్లిపోయారు. వొడాఫోన్ ఐడియా ఈ కాలంలో మొత్తం 15.2 లక్షల (1.52 మిలియన్) కస్టమర్‌లను కోల్పోయింది. దీని కారణంగా వొడాఫోన్ ఐడియా మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 22.15 కోట్లకు (221.5 మిలియన్లు) పడిపోయింది. జియో తాకిడిని తట్టుకుని నిలబడటానికి ఎయిర్‌టెల్ కనీసం ప్రయత్నిస్తుంది. కానీ వొడాఫోన్ ఐడియా మాత్రం నిరంతరం స్ట్రగుల్ అవుతూనే ఉంది.


భారత దేశంలోని పట్టణ ప్రాంతాల్లో వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 63.34 కోట్ల నుంచి 63.39 మిలియన్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 52.50 కోట్ల నుంచి 52.67 కోట్లకు పెరిగింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం 2024 జనవరిలో 1.23 కోట్ల రిక్వెస్ట్‌లు వచ్చాయి.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


2024 జనవరి నాటికి భారతదేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ బేస్ 119.325 కోట్లుగా ఉంది. ఈ నెలలో వైర్‌లెస్, వైర్‌లైన్ సేవల కోసం 2.92 మిలియన్ల మంది సభ్యులు కొత్తగా చేరారు. వైర్‌లైన్ విభాగం కూడా సానుకూల వేగాన్ని నమోదు చేసింది. 0.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల పెరుగుదలతో మొత్తం 32.54 మిలియన్లకు చేరుకుంది. ఇంత వేగంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యను చూస్తే భారతీయ టెలికాం కుటుంబం ఎంత పెద్దదిగా మారుతుందో స్పష్టమవుతుంది.


ఇది కాకుండా వైర్డ్, వైర్‌లెస్ సేవలతో సహా బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగింది. బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్‌లలో పెరుగుదల భారతదేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు