HP New Laptop: హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని హై పెర్ఫార్మెన్స్, మంచి గేమింగ్ సామర్థ్యాలతో ఈ ల్యాప్‌టాప్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఎన్‌వీడియాతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని వీటిలో ఎన్‌వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3050ఏ జీపీయూ, 4 జీబీ వీడియో ర్యామ్‌లను ఈ ల్యాప్‌టాప్‌ల్లో అందించనున్నట్లు ప్రకటించింది. హెచ్‌పీ గేమింగ్ గెరాజ్‌కు ఫ్రీ యాక్సెస్, ఆన్‌లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం, ఈస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, గేమ్ డెవలప్‌మెంట్ వంటి ఆఫర్లను కూడా హెచ్‌పీ అందిస్తుంది.


హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ల ధర ఎంత? (HP Victus Special Edition Price in India)
హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ల ధర మనదేశంలో రూ.65,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో వేర్వేరు మోడల్స్, వేర్వేరు స్పెసిఫికేషన్లతో అందుబాటులో ఉన్నాయి. కానీ కంపెనీ ఈ మోడల్స్ గురించి ఇంకా సమాచారం అందించలేదు. అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీన్ని కంపెనీ వెబ్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లు, మేజర్ అవుట్‌లెట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే వారికి రూ.6,097 విలువైన హైపర్ఎక్స్ క్లౌడ్ స్టింగర్ 2 హెడ్‌సెట్‌ను కేవలం రూ.499కే అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కొన్ని సేల్స్ టచ్ పాయింట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (HP Victus Special Edition Features)
హెచ్‌పీ విక్టస్ ఎడిషన్ 16 ల్యాప్‌టాప్‌కు రీ ప్యాకేజ్డ్ వెర్షనే ఈ హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్. ఇందులో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఎన్‌వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3050ఏ జీపీయూ, 4 జీబీ వీడియో ర్యామ్‌ ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.


కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం... ఎన్‌వీడియాతో భాగస్వామ్యం కారణంగా హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ల్లో డెడికేటెడ్ జీపీయూని అదనంగా అందించారు. ఈ జీపీయూ వల్ల గేమింగ్ సమయంలో రే ట్రేసింగ్ సామర్థ్యాలు మెరుగవుతాయి. ఈ జీపీయూ ద్వారా ఏఐ ఫీచర్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో సులభంగా రన్ చేయవచ్చు.


ఈ స్టూడెంట్ ఫోకస్డ్ ల్యాప్‌టాప్‌లో 70Whr బ్యాటరీని అందించారు. హెచ్‌పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్ బరువు 2.29 కేజీలు కాగా, ఫుల్ సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డును ఇందులో అందించారు. దీంతోపాటు న్యూమరిక్ కీప్యాడ్ కూడా ఉంది. హీట్ మేనేజ్‌మెంట్ కోసం ఇందులో ఐఆర్ థర్మోపైల్ సెన్సార్‌ను అందించినట్లు కంపెనీ ప్రకటించింది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే