HMD Barbie Phone Launched: నోకియా మాతృ సంస్థ హెచ్ఎండీ బార్బీ ఫోన్‌ను కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇది ఒక క్లాసిక్ ఫ్లిప్ ఫోన్. దీన్ని బార్బీ థీమ్‌తో డిజైన్ చేశారు. పూర్తిగా పింక్ బాడీ, పింక్ బ్యాటరీ, పింక్ ఛార్జర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ప్రత్యేకమైన జ్యుయలరీ బాక్స్‌లో విక్రయించనున్నారు. ఇందులో హ్యాండ్ సెట్, బీడెడ్ లాన్‌యార్డ్స్, ఛార్మ్స్, రెండు అదనపు బ్యాక్ కవర్లు, స్టిక్కర్లు, జెమ్స్‌ను కూడా అందించారు. ఈ ఫ్లిప్ ఫోన్ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే వైపు అద్దం కూడా బిగించారు. ఈ ఫోన్‌లో బీచ్ థీమ్డ్ మాలిబు స్నేక్ గేమ్‌ను అందించారు.


హెచ్‌ఎండీ బార్బీ ఫోన్ ధర (HMD Barbie Phone Price)
దీని ధరను 129 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.10,800) నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. సింగిల్ పవర్ పింక్ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్‌ను కూడా పింక్ కలర్‌లోనే అందించారు. ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


హెచ్ఎండీ బార్బీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (HMD Barbie Phone Specifications)
ఇందులో 2.8 అంగుళాల క్యూవీజీఏ మెయిన్ డిస్‌ప్లేను, 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ కవర్ స్క్రీన్‌ను అందించారు. దీని ఔటర్ డిస్‌ప్లేను అద్దంగా ఉపయోగించుకోవచ్చు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 64 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. బార్బీ థీమ్డ్ యూఐపై పని చేసే ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.


హెచ్‌ఎండీ బార్బీ ఫోన్ కీప్యాడ్ ఐకానిక్ బార్బీ పింక్ షేడ్‌లో రానుంది. పామ్ ట్రీస్, హార్ట్ సింబల్స్, ఫ్లెమింగో డిజైన్స్‌ను కూడా చూడవచ్చు. ఫోన్ ఆన్ చేయగానే హాయ్ బార్బీ అని ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. బీచ్ థీమ్ ఉన్న మాలిబు స్నేక్ గేమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో 0.3 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా అందించారు. ఫోన్‌లో 1450 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే తొమ్మిది గంటల టాక్ టైమ్ అందించనుంది. 4జీ, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 1.89 సెంటీమీటర్లు కాగా, బరువు 123.5 గ్రాములుగా ఉంది.






Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?