Andhra Pradesh: పోలీసు సీఐ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెబుతున్న వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ వ్యవస్థ పరువు పోయిందంటూ వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి వ్యవహారంపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పోలీసులకు కనీసం గౌరవ మర్యాదలు దక్కడం లేదంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
ఇసుకను తరలిస్తున్న టిప్పర్ యజమానులపై కేసులు నమోదు చేయాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి, తన అనుచరులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణలు చెప్పాలంటూ దాదాపు రెండు గంటలపాటు నినాదాలు చేస్తూ ఆయన అనుచరులు హంగామా చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై డీసీపీ కూడా సీఐకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరకు సీఐ క్షమాపణలు చెప్పడంతో ఎమ్మల్యే శాంతించారు. దీనికి సంబంధించిన ఎమ్మెల్యేకు CI వీడియో కాల్ చేసి క్షమాపణలు చెబుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు భయపడిపోవాల్సి వస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
నిన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్..
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి తాడిపత్రిలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆఖరుకి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం అన అనుచరురు, టీడీపీ నాయకులు విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఒక వీడియో సైతం రిలీజ్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెడితే ఊరుకునేది లేదని, ఇక్కడికొచ్చిన టిప్పర్ వెనక్కి పోదని టిప్పర్ యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ఉండగా కేవలం 25 మందే ఇసుక తరలించుకుంటూ సంపాదించుకుంటున్నారని జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కూడా గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయానని ఆ ఇసుక వ్యవహారం తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు అమ్ముకోవడం కూడా చేతకాదు.. నేను అమ్మిపెడతానని వారికి హమీ కూడా ఇచ్చారు. ఇసుక రవాణాపై ఏసీబీ తనిఖీలు చేస్తోందని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక తరలింపు వ్యవహారంపై ఎన్జీటీ, సుప్రీంకోర్టులు చుట్టూ తిరిగితే, ఇప్పుడు నా నియోజకవర్గంలోనే తరలిస్తుంటే చూస్తూ ఊరుకోనని జేసీ మండిపడ్డారు.
Also Read: టీడీపీలోకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ- వైసీపీకి బిగ్‌షాక్!