Allu Arjun Vs Janasena: ఇక దాచేదేమీ లేదు. మెగా, అల్లు ఫ్యామిలీ విభేదాలు రోడ్డుపైకి వచ్చేశాయి అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య విభేదాలు సహజమే అంటూ ఇన్నాళ్ళు సర్ది చెప్పుకుంటూ వచ్చిన సీనియర్ మెగా ఫ్యాన్స్ సైతం ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోంది అనే భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కేవలం అల్లు అర్జున్ నంద్యాల టూర్‌, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్లే ఈ గొడవలు అనుకున్నారు. కానీ అసలు అంతకు ముందు నుంచే ఉన్న మనస్పర్థలకు ఆ ఇన్సిడెంట్ ఒక కొనసాగింపు మాత్రమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. అల్లు అర్జున్ పూర్తిగా మెగా నీడ నుంచి బయటకు వచ్చేసి అల్లు బ్రాండ్‌ను బలోపేతం చెయ్యడానికి కారణం కూడా వేరే ఏదో ఉందనే వాదన ఇప్పుడు మొదలైంది.


మెగా vs అల్లు గొడవ మొదలైంది ఎక్కడ??
చాలామంది అనుకునేది అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్‌ అభిమానులు పవర్ స్టార్ గురించి మాట్లాడాలని గోల చేస్తుంటే "చెప్పను బ్రదర్ " అని అనడంతో అని. ఆ తరువాత కూడా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్టు కనపడలేదు. పైగా పవన్ తల్లి మీద కొందరు దారుణమైన కామెంట్స్ చేసినప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్‌ను హత్తుకుని మరీ మద్దతు తెలిపారు అల్లు అర్జున్. ఆ తరువాత అల్లు స్టూడియో ఏర్పాటుతో సొంత బ్రాండ్ కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టమైంది. అదే సమయంలో తన ఫ్యాన్స్‌ను ఆర్మీ అని పిలుస్తూ వారికి కూడా మెగా ఫ్యాన్స్‌లా ప్రత్యేక గుర్తింపు తెచ్చే ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. ఇవన్నీ ఏం జరుగుతుందనే అయోమయాన్ని మెగా ఫ్యాన్స్‌లో క్రియేట్ చేశాయి .


నంద్యాల టూర్‌తో టార్గెట్ అయిన బన్నీ
సరిగ్గా ఎన్నికల ముందు పవన్ ప్రత్యర్థిగా భావించే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫాన్స్ జన సైనికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలనే అల్లు అర్జున్ ఆ టూర్‌కు వెళ్లారని తన మార్కు తన బ్రాండు వేరని స్టేట్మెంట్ ఇచ్చేందుకే ఆ పని చేశాడు అనేది వాళ్ల ఫీలింగ్. దానికి తగ్గట్టే నాగబాబు సైతం ఎన్నికల తర్వాత ఇండైరెక్ట్‌గా బన్నీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయినప్పటికీ పవన్ గెలుపు తర్వాత ఇంటికి వెళ్లి మెగా బ్రదర్స్ ఆశీస్సులు తీసుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ అక్కడ కనపడకపోవడం కూడా రకరకాల కథనాలకు ఊతమిచ్చింది.


స్మగ్లర్ల సినిమాలపై పవన్ కామెంట్స్
కొంతకాలం ఈ గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో పక్క కర్ణాటక వెళ్లిన పవన్ అక్కడ మాట్లాడుతూ కల్చరల్‌గా సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది అన్నారు. ఒకప్పుడు అడవులను కాపాడే వాళ్ళు సినిమాల్లో హీరోలు అయితే ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా మారారు అని అన్నారు. ఇది పుష్ప సినిమాను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సహా అందరి వాదన. కానీ ఆయన ఎక్కడా అల్లు అర్జున్ పేరు నేరుగా ఎత్తలేదని జనసైనికుల వాదన.


నమ్మినోళ్ల కోసం అంటున్న బన్నీ 
పవన్ చేసిన కామెంట్స్‌ వైరల్ కావడంతో మొన్నీ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న అల్లు అర్జన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానని అన్నాడు. ఇది పవన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్‌గానే అందరు భావించారు. అంతే కాకుండా ఫ్యాన్స్‌ను పొగుడుతూ మీరు నా ఆర్మీ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఇవన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా ఉండాలనే సంకేతాలు ఇచ్చినట్టు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  


రంగంలోకి అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి
ఇంతలో సడన్‌గా ఈ సీన్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు చంద్ర శేఖర్ రెడ్డి . అసలు ఎన్డీఏలో భాగంగా ఉండి అదే ఎన్డీయే ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించిన అల్లు అర్జున్ చేసిన పాత్రపై ఎలా కామెంట్ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రాన్ని అవమానించడం కాదా అని పవన్ ను నిలదీశారు. దీంతో ఈ గొడవ ఫ్యాన్స్ నుంచి కుటుంబం వరకూ చేరిపోయింది .


మెగా ఫ్యాన్స్ లేకుంటే అల్లు అర్జున్ ఎవరు? జనసేన ఎమ్మెల్యే
ఇప్పుడు ఈ గొడవలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చింది జనసేన. ఆ పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్" అసలు మెగా ఫ్యాన్స్ లేకుంటే అల్లు అర్జున్ ఎవరు. సొంతంగా షామియానా కంపెనీ పెట్టుకున్నట్టు ఎవరుపడితే వాళ్ళు ఆర్మీ అంటూ పెట్టుకుంటున్నారు. అసలు అల్లు అర్జున్‌ను మాతో రమ్మని ఎవరు పిలిచారు. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటూ అల్లు అర్జున్ ఏదో మాట్లాడుతున్నారు. అంత శక్తే అల్లు అర్జున్‌కు ఉంటే తన తండ్రి అల్లు అరవింద్‌నే గతంలో ఎంపీగా గెలిపించుకునేవాడుకదా" అంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. 


వీటిని హై కమాండ్‌కు తెలియకుండా చేసిన వ్యాఖ్యలుగా ఏమాత్రం చూడలేము అంటున్నారు విశ్లేషకులు .దీనితో ఒక్కసారిగా అల్లు vs మెగా ఫేస్ ఆఫ్ మొదలైనట్టే అనే వాదన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఇది రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి .