YCP is taking advantage of the gap between Allu Arjun and Janasena : "చెప్పను బ్రదర్" అంటూ గతంలో అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ చాలా కాలం పాటు వైరల్ అయింది. ఈ డైలాగ్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నట్లుగా అప్పట్లో అందరూ నమ్మడమే కారణం. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రచారం కోసం వెళ్తే అల్లు అర్జున్ మాత్రం.. తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారు. ఆ స్నేహితుడు వైసీపీ తరపున పోటీ చేస్తూండటంతో అసలు చిచ్చు ప్రారంభమయింది. అప్పట్లోనే అర్జున్ తీరుపై మెగా ఫ్యామిలీతో పాటు .. జనసేన కార్యకర్తల్లోనూ విమర్శలు వినిపించాయి. కానీ ఎన్నికల ఫలితాలతో అంతా సద్దుమణిగిపోయింది అనుకున్న సమయంలో .. ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న అర్జున్ తన ఇష్టమైన వారి కోసం వస్తానని చేసిన ప్రకటనతో మరోసారి రాజుకుంది. అంటే పవన్ కల్యాణ్ అంటే ఇష్టం లేదా అన్న అర్థం తీసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనల వెనుక విపరీత అర్థాలు వెదుక్కోవడంతోనే అసలు సమస్య
పవన్ కల్యాణ్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆయన అటవీ మంత్రి. ఆ శాఖకు చెందిన అంశాలపై మాట్లాడేందుకే వెళ్లారు. ఆ సమయంలో సినిమాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లే హీరోలుగా ఉంటున్నారని యథాలాపంగా ఓ మాట అన్నారు. అది అల్లు అర్జున్ ఉద్దేశించే అన్నారని అనేక విశ్లేషణలు చేసుకున్నారు. కానీ పవన్ ప్రెస్ మీట్ వింటే జనరల్ గా అన్నారని అర్థమవుతుంది. అయితే ఇదే అంశంపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం మరో రేంజ్ కు వెళ్లడానికి కారణం అయింది. ఆ తర్వాత అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం చేశాయి. అల్లు అర్జున్.. తన స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తానన్నాడు. అయనది స్నేహం కోసం.. ఆయన దృష్టిలో రాజకీయం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి కూడా ఆయన హాజరయ్యారు. కానీ ప్రకటనల మధ్య ద్వందార్థాలు తీసుకోవడమే అసలు సమస్యగా మారింది.
వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ నూర్జహాన్ దంపతులు
జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మరో రేంజ్‌కు వివాదం
అటు అల్లు అర్జున్ వ్యాఖ్యలు.. ఇటు ఆయన మామ విమర్శలతో జనసైనికులు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే అనూహ్యంగా .. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అర్జున్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఆయన అర్జున్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. సొంత తండ్రిని గెలిపించుకోలేకపోయారని కూడా విమర్శించారు. అర్జున్ కు అసలు ఫ్యాన్స్ లేరని..అంతా మెగా ఫ్యాన్సేనని చెప్పుకొచ్చారు. ఈ మాటలు ఖచ్చితంగా మరింత చిచ్చు పెట్టేలా ఉన్నాయి.
ఇదే చాన్స్ గా మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు
రాజకీయాలు అంటేనే వచ్చిన చాన్స్ ను సమర్థంగా వినియోగించుకోవడం. రాజకీయాలకు సంబంధం లేని అల్లు అర్జున్ వ్యాఖ్యల కేంద్రంగా ఏర్పడిన వివాదంతో మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక ముఖ్యంగా పవన్ కల్యాణ్ , జనసేనకు వ్యతిరేకంగా ఓ బలమైన క్యాంపెయిన్ నిర్వహించేందుకు అవకాశం దొరికింది. వెంటనే వైసీపీ సానుభూతిపరులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రూపంలోకి మారిపోయి అసలు రాజకీయం ప్రారంభించారు. ఫలితంగా ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. అర్జున్ ఫ్యాన్స్ ను.. పవన్ కు వ్యతిరేకం చేసి.. వారు వైసీపీ సపోర్టర్లుగా మార్చాలన్న వ్యూహంతో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా ఓ మిషన్ ప్రారంభించిందని ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి.
ఏపీలో తేలని నామినేటెడ్ పోస్టులు - కూటమి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదా ?
ఇక్కడితో పులిస్టాప్ పెట్టేలా పవన్ జోక్యం చేసుకోవాల్సిందే !
అల్లు అర్జున్ ఇష్యూ అసలు ఇప్పుడు సమస్యే కాదు. పట్టించుకోవాల్సిన అంశం కూడా కాదు. అల్లు అర్జున్ రాజకీయంగా ఎలాంటి అభిప్రాయంతో లేరు. ఆయన స్నేహితుల కోసం వెళ్తానని ప్రకటించారు అది ఏ పార్టీ అన్నది ఆయన పట్టించుకోరు. పైగా ఓ చిన్న సినిమా ఫంక్షన్ కు హాజరైన అంశంపైనే ఆయన మాట్లాడారు. ఆ సినిమా కు సంబంధించిన వారు ఇష్టం కాబట్టే వచ్చానన్న అర్తంలో మాట్లాడారు. కానీ దాన్ని రాజకీయం చేసుకున్నారు. ఈ విషయంలో రెండు వైపులా పొరపాటు ఉంది. కానీ నష్టపోయేది మాత్రం జనసేన పార్టీనే. అందుకే పవన్ కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని ఈ ఫ్యాన్ వార్ ని పొలిటికల్ వార్ గా మారకుండా చూసుకుంటే.. మంచిదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.