Process of filling nominated posts has not yet started in Andhra  :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టాలను.. కేసులని పదవులు పొందడం ద్వారా మర్చిపోవాలని అనుకుంటున్నారు.  కానీ రోజులు గడిచిపోతున్నాయి ... పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. 

 

హాట్ ఫేవరేట్ పదవుల కోసం ఎదురు చూపులు

 

ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి ఉన్నాయి. టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వాటికి పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కేబినెట్ హోదా ఉన్న పదవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటన్నింటి కోసం పార్టీ కోసం శ్రమ పడిన వారు ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏదీ తేల్చలేకపోతున్నారు. ఇదిగో అదిగో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో పదవులు ఫలానా వాళ్లకే నంటూ విస్తృత ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉందన్నది ఎవరికీ తెలియదు. 

 


 

మిత్రపక్షాలకు పంచడమే సమస్యగా మారుతోందా ?

 

నామినెటెడ్ పదవుల్లో ఓ ఫార్ములాను సిద్ధం చేశారని  ప్రచారం జరిగింది.  70 శాతం టీడీపీకి.. మిగతా ముప్ఫై శాతం  జనసేన, బీజేపీకి పంచుతారని చెప్పుకున్నారు. అయితే క్యాడర్ మొత్తం టీడీపీదే ఉంటుంది. పొత్తులు ఉన్న  చోట్ల త్యాగం చేసి.. ఆయా పార్టీల విజయాలకు పని చేసింది తామేనని టీడీపీ నేతలంటున్నారు. జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు కానీ.. క్యాడర్ లేదని.. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారన్న కారణంగా పదవులు ఇస్తే పని  చేసిన టీడీపీ నేతలు అసంతృప్తికి గురవుతారన్న్ భావన ఉందంటున్నారు. అలాగే బీజేపీ విషయంలోనూ అదే జరుగుతుందని ... అందుకే పదవుల ప్రకటన ఆలస్యమవుతోందని చెబుతున్నారు. 

 


 

క్యాడర్ లో పెరుగుతున్న అసంతృప్తి

 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ లో కాస్త అసంతృప్తి ఉంది. వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న భావన ఓ వైపు.. పదవులు రావడం లేదని అసహనానికి గురవుతున్నారు. ముందుగా అగ్రనేతలకు ఇవ్వాల్సిన పదవులు భర్తీ చేస్తే ఆ తర్వాత మండల గ్రామ స్థాయి నేతలు ..  మార్కెట్ యార్డ్ సహా ఇతర పోస్టుల కోసం ఎదురు చూస్తూంటారు. గతంలో కన్నా.. టీడీపీ నేతలు గత ఐదేళ్లలో  పడిన కష్టమే ఎక్కువ. అందుకే వారు ప్రతిఫలం కోరుకుంటున్నారు. త్వరగా కోరుకుంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ఆలకిస్తారా ?