BJP: దక్షిణ రాష్ట్రాల్లో బలపడడానికి బీజేపీ వ్యూహం మార్చినట్టుగా కనపడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎన్నికలు దాటినా సౌత్ ఇండియా అనేది బీజేపీకి అందని ద్రాక్షలానే కనపడుతోంది. మధ్యలో కొన్నిసార్లు కర్ణాటకలో గెలుపొందినా అంతర్గత కుమ్ములాటలు ఆ గెలుపును శాశ్వతం చేసుకోలేక పోయింది కమలం పార్టీ. దానితో పూర్తిగా సమీక్షించుకుని బీజేపీ తన వ్యాహన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. దానికి తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వేరి చేసిన కామెంట్స్ అంటున్నారు పరిశీలకులు. బిజెపి ఎన్నడూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయదని రాజ్యాంగ పరిమితులకు లోబడే పని చేస్తుందని ఆమె అనడం కచ్చితంగా బిజెపి కొత్త వ్యూహంగా కనపడుతోంది అంటున్నారు.


దక్షిణాదిన పెద్దగా వర్కవుట్ కాని బీజేపీ అగ్రెసివ్ పంథా
బిజెపి వివిధ రాష్ట్రాల్లో బలపడిన విధానం చూస్తుంటే అది కచ్చితంగా వీలైనంత అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయడమే కారణంగా కనిపిస్తుంది. కేంద్రం నుంచి మొదలుకొని యూపీలాంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇది వర్క్ ఔట్ అయ్యింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UPA 2 ప్రభుత్వం రకరకాల స్కాముల్లో ఇరుక్కుపోవడం అదే సమయంలో జరిగిన నిర్భయ ఇన్సిడెంట్, జన లోక్ పాల్ ఉద్యమం బిజెపికి కలిసి వచ్చాయి. బీజేపీ తన అగ్రెసివ్ ప్రచారం బయటకు తీసుకొచ్చింది. నేషనలిజంతో ఉత్తరాది రాష్ట్రాల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. సౌత్‌లో టీడీపీ లాంటి పార్టీల పొత్తుతో పట్టు సాధించే ప్రయత్నం చేసింది. 


ఇదంతా 2014 నాటి విషయం అయితే ఆ తరువాత మాత్రం దక్షిణాదిలో సీన్ మారింది. టీడీపీతో తెగదెంపులు, కర్ణాటకలో అధికారం కోల్పోవడం లాంటివి బిజెపి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. 2019 ఎన్నికల్లో కేంద్రంలో హవా చూపినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఎఫెక్ట్ చూపలేక పోయింది. కాస్త తెలంగాణలో ఓ మోస్తరు ఫలితాలు ఈ పదేళ్ళ కాలంలో చూపగలిగింది. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక అయిపోయింది అనుకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీ తన వ్యూహాలను పునస్సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది .


దక్షిణాదిన వరుసగా విఫలమైన ప్రయోగాలు
నిజానికి 2019 తరువాత బీజేపీ సౌత్ రాష్ట్రాల్లో చేసిన ప్రయోగాలు వర్క్ అవుట్ కాలేదు. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి కన్నా, సోము వీర్రాజు లాంటి వారికి రాష్ట్ర బిజెపి పగ్గాలు అప్పజెప్పినా దక్కింది మాత్రం శూన్యం. తెలంగాణలో అంత కష్టపడి బండి సంజయ్,ధర్మపురి అరవింద్, రాజా సింగ్ లాంటి నేతల దూకుడుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినా అధికారం మాత్రం చేజిక్కలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మాదే అనుకున్న కర్ణాటకనూ కాంగ్రెస్ పట్టుకుపోయింది. కేరళ సంగతి సరేసరి. పోనీ రాజకీయ శూన్యత ఉందని భావించిన తమిళనాడులో అన్నామలై ద్వారా చేసిన ప్రచారం వర్కౌట్ కాలేదు. దీనితో బీజేపీ స్టాండ్ మార్చినట్టే కనపడుతోంది.


దక్షిణాది రాష్ట్రాల ప్రయారిటీ వేరు
దక్షిణాదిలో ప్రధాన రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటకలో ప్రాధాన్యత ఎప్పుడూ డెవలప్‌మెంట్, ప్రజాజీవనం వీలైనంత శాంతంగా సాగిపోవడంపైనే ఆధారపడి ఉంటుంది తప్ప దూకుడు రాజకీయాలు ఇక్కడ సరిపడవు. దీనిని గుర్తించడంలోనే బిజెపి విఫలమైంది. సోషల్ మీడియాలోనో టీవీల్లోనో ఆవేశపూరిత ప్రసంగాలనూ ఎంజాయ్ చెయ్యొచ్చు ఏమోగానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అభివృద్ధి చేసే నాయకుడు అనేదే వారి మంత్రం. ఇది బీజేపీకి 2024 ఎన్నికల తరువాత బాగా అర్థమైంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలతో మరింత స్పష్టత వచ్చింది. 


Also Read: తెలంగాణలో తొలి తెలుగు పత్రిక ‘తెనుగు పత్రిక’కు 100 ఏళ్లు పూర్తి, ఇనుగుర్తిలో శత జయంతి వేడుకలు


మారిన బీజేపీ పంథా
ఎక్కడో ఏదో జరిగిపోతోంది అని భయపెట్టే రాజకీయం సౌత్‌లో నడవదని అర్థం చేసుకున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాన్ని మార్చింది. ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి లేటెస్ట్ కామెంట్స్ దీనికి ఉదాహరణ అన్న వ్యాఖ్యానాలు ఆల్రెడీ మొదలయ్యాయి. బిజెపి ఎప్పటికీ భారత రాజ్యాంగాన్ని మార్చదు. పైగా రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుంది అని ఏకంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చర్చి, మసీదులను కూల్చేస్తామని అసత్య ప్రచారం చేశారు కానీ బిజెపి కలిపే పార్టీనే కానీ విభజించే పార్టీ కాదని ఆమె చెప్పడం కొత్త తరంలోకి ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నంలో భాగమే అంటున్నారు పరిశీలకులు. 



సరిగ్గా గమనిస్తే 2024 తరువాత అన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనూ దూకుడుగా ఉండే లీడర్ల స్థానంలో మైల్డ్‌గా జనంతో కలిసిపోయే నాయకులకే పెద్దపీట వేస్తుంది బీజేపీ. తెలంగాణలో ఈ ఎన్నికల కిషన్ రెడ్డికి లభిస్తున్న ప్రాధాన్యత దీనికి ఉదాహరణ. ఓవరాల్‌గా బిజెపి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అందరితో కలిసిపోయే కలుపుకుని పోయే వ్యూహంతో మిషన్ సౌత్‌ను ప్రారంభించిన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఆ ప్రయత్నాలూ ప్రయోగాలూ ఏ మేర ఫలిస్తాయో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే .


Also Read: అన్న క్యాంటిన్‌లో శుభ్రతపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ -సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ