TDP Vs YSRCP: నలుగురికి అన్నపెట్టే అన్న క్యాంటీన్‌లో శుభ్రత లేదని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. చేతులు కడిగిన సింక్‌లోనే నీళ్లు నింపి అందులో ముంచిన ప్లేట్లలోనే ఆహారం వడ్డిస్తున్నారని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్‌లో షేర్ చేసింది వైసీపీ.
ఆ పోస్టులో ఇలా రాసుకుంటూ వచ్చింది. "అన్నం పెడతామని అవమానిస్తారా...? గతిలేక తినడానికి వస్తున్నారని అవహేళన చేస్తారా?పేదలకు రూ.5 కే భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకుంటూ, పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పని ఇది. అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లు కడగడం, అడిగితే గతిలేక తినడానికి వస్తున్నారని కటువుగా మాట్లాడడం... తణుకు అన్న క్యాంటీన్లో సన్నివేశం ఇది. పేదలకు పెట్టే తిండి, వారికి ఇచ్చే మర్యాద ఇదేనా? అందుకేనా అర ముక్క ఇడ్లీతో లోకేష్, చెంచా రైస్‌తో చంద్రబాబు తింటున్నట్టు నాటకం ఆడింది. పేదలంటే అంత చిన్న చూపా" అంటూ ప్రశ్నిస్తూ తీవ్రపదజాలంతో పోస్టు పెట్టింది.
దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న క్యాంటీన్‌పై కూడా విషం చిమ్ముతారా అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో మరో వీడియో పెట్టారు. ప్రభుత్వ విభాగం కూడా ఫ్యాక్ట్ చెక్ పేజ్‌లో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టింది ఫేక్ అంటూ చెప్పుకొచ్చింది.
లోకేష్ ఏమన్నారంటే" అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. చేతులు కడుగు స్థలంలో వైసిపి మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అని చెప్పుకొచ్చారు.
అటు టీడీపీ మద్దతుదారులు కూడా అన్న క్యాంటీన్లలో ఎంత శుభ్రత పాటిస్తారో తెలియజేసే వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అన్న క్యాంటీన్లపై కావాలని వైసీపీ రచ్చ చేస్తోందని మండిపడుతున్నారు. అన్న క్యాంటీన్లలో ఎంత శుభ్రత పాటిస్తారో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలంటూ కొన్ని మీడియా సంస్థలు చేసిన వీడియోలను, అక్కడ కొందరు తీసిన వీడియోలను షేరే చేస్తున్నారు.