Eleti Maheshwar Reddy | హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపిస్తోందని, పాతబస్తీలోని అక్రమ కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ సీపీకి ధైర్యం ఉంటే ఒవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఒవైసీల అక్రమ కట్టడాలను కూల్చడానికి హైడ్రా వద్ద బుల్డోజర్స్ లేకుంటే చెప్పాలని, పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


‘హైదరాబాద్, జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మీకు దమ్ముంటే పాతబస్తీలోని సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి. గత 20 ఏళ్లుగా సలకం చెరువు, కుంటల భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సలకం చెరువులో ఉన్న ఒవైసీల అక్రమ కట్టడాలు కులగొట్టే దమ్ము, ధైర్యం హైడ్రాకు లేదా? మీ దగ్గర బుల్డోజర్లు లేకుంటే చెప్పండి. పక్క రాష్ట్రాల నుండి తెప్పిస్తాం. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలు కమిషనర్‌కు కనిపించడం లేదా? లేదంటే నేను వచ్చి చూపిస్తా. అవసరమైతే బుల్డోజర్లు లేకుంటే చెప్పండి, పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తా’ అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 


రాష్ట్ర ప్రభుత్వానికి పాతబస్తీపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, అక్కడ ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి. ఎన్ని ఎకరాలను ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో కబ్జా అయిన భూముల్ని ఆక్రమించింది ఎవరు, అవి ఎవరి పేరు ఉన్నాయో గుర్తించి చట్ట ప్రకారం కూల్చివేయాలని హైడ్రాను, తెలంగాణ ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి కోరారు. 13వేల అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎప్పటివరకూ పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువుల భూములు కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.


Also Read: Akbaruddin Owaisi: నాపై మళ్లీ తూటాల వర్షం కురిపించండి, కత్తులతో పొడవండి కానీ!: అక్బరుద్దీన్ ఒవైసీ