Kothakota Srinivas Reddy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. లంచాలు, వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఆరోపణ నిజం అయితే ఉద్యోగం నుంచి పూర్తిగా డిస్మిస్ చేస్తామని తేల్చి చెప్పారు. పలుమార్లు హెచ్చరించినా కూడా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా పెడతామని కోత్తకోట శ్రీనివాస్ తెలిపారు.
డ్రగ్స్ పైన కూడా వార్నింగ్
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుబడడంతో మరోసారి సీపీ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు. బోయినపల్లిలో తాజాగా రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న ఎంఫిటమిన్ అనే డ్రగ్స్ ను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ ను ఇంజక్షన్లు, లిక్విడ్ గాను వివిధ రూపాల్లో తీసుకొంటున్నారని.. ఈ డ్రగ్ ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తున్నారని సీపీ చెప్పారు.
అంతేకాక, సీపీ శ్రీనివాస్ రెడ్డి యువతకు వార్నింగ్ ఇచ్చారు. నగర యువత డ్రగ్స్ బారిన పడొద్దని.. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు. కారకులపై ఉక్కుపాదం తప్పదని సీపీ శ్రీనివాస్ అన్నారు. పార్టీలకు వెళ్లే యువత జాగ్రత్తగా ఉండాలని.. తెలిసో, తెలియకో ఎవరైనా డ్రగ్స్ ను తెలియకుండా అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తుంటారని చెప్పారు. కాబట్టి యువత పార్టీల్లో అలెర్ట్ గా ఉండాలని సూచించారు.