గత బిల్లును ఉపసంహరించుకున్న నెలరోజుల తర్వాత కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి శుక్రవారం విడుదల చేసింది. ఆగస్టు ప్రారంభంలో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అప్పట్లో చాలా చర్చనీయాంశం అయింది. గూగుల్. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా వంటి పెద్ద టెక్ సంస్థలను ఈ బిల్లు అప్రమత్తం చేసింది.


వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తే రూ.250 కోట్ల జరిమానా విధించనున్నారన్నది సవరించిన ముసాయిదాలోని కీలకాంశం. "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022 ముసాయిదాపై మీ అభిప్రాయాలను కోరుతున్నాం." అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్‌లో ప్రకటించారు.


ఆగస్టులో మునుపటి డేటా రక్షణ బిల్లును ఉపసంహరించుకున్న తర్వాత, సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు సరిపోయే తాజా నిబంధనలను రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును గోప్యతా నిపుణులు తప్పుబట్టారు. కొన్ని షరతులలో స్వేచ్ఛగా డేటాను పొందేందుకు బిల్లు అనుమతించినందున ఇది కేంద్ర ఏజెన్సీలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.


లాభాపేక్ష లేని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (IFF) ప్రకారం, డేటా ప్రొటెక్షన్ బిల్లు 2021 ప్రభుత్వ విభాగాలకు పెద్ద మొత్తంలో మినహాయింపులు ఇచ్చింది. అలాగే పెద్ద సంస్థల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల గోప్యత ప్రాథమిక హక్కును తగినంతగా గౌరవించలేదు.


అమెజాన్, గూగుల్, మెటా వంటి పెద్ద సాంకేతిక సంస్థలు డేటా స్థానిక నిల్వ, దేశంలోని కొన్ని సున్నితమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయడం తప్పనిసరి చేసే బిల్లులోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. ఇది చట్టం నిబంధనల నుంచి ప్రభుత్వ స్వంత దర్యాప్తు సంస్థలకు మినహాయింపులను అందించాలని కూడా చూసింది.


పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసిన ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ బిల్లును అమలు చేయడం వల్ల భారతదేశ వ్యాపార వాతావరణం గణనీయంగా క్షీణిస్తుందని, దీంతో విదేశీ పెట్టుబడుల రాక తగ్గుతుందని దాదాపు డజను పరిశ్రమ సంస్థలు వైష్ణవ్‌కు లేఖ రాశాయి.