తెలంగాణలో ఎన్నికల వేడిక రోజురోజుకు రాజుకుంటోంది. మునుగోడుతో మొదలైన కాక ఇంకా చల్లారలేదు. ఇన్నాళ్లు విమర్శలకే పరిమితమైన పోరాటం ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులు చేయడం సంచలనంగా మారింది. టీఆర్‌ఎస్ నేతలు రాజారాం యాదవ్‌, తెలంగాణ జాగృతి కన్వీనర్‌ రాజీవ్ సాగర్ ఈ దాడికి నాయకత్వం వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 


తన ఇంటిపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్నారు ఎంపీ అరవింద్. కెసిఆర్, కేటీఆర్‌, కవిత ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ట్విటర్‌లో ఆరోపించారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, తన అమ్మను బెదిరించారని ఆరోపించారు. దీనిపై దిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టే ఛాన్స్ ఉందని సహచరరులు చెబుతున్నారు. 






నిజామాబాద్‌ ఎంపి అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ లీడర్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి దాడుల సంస్కృతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ సహ చాలా మంది నేతలు అరవింద్‌కు ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు. 


దాడిపై బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతోనే భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అడిగే వాటికి సమాధానం చెప్పలేక దద్దమ్మలు దాడులను ప్రశ్నించే గొంతును నొక్కేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. గడీల గూండాల దాడులకు తోక ఊపలకు తాము భయపడేది లేదన్నారు. తాము సహనంగా ఉన్నామంటే అది చేతగానితనంగా అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. తాము తమ లీడర్లు బరిలోకి దిగితే టీఆర్‌ఎస్ తట్టుకోలేదని హెచ్చరించారు. ప్రజలే టీఆర్ఎస్ గుండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 







నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఇలా దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆమె ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేస్తేనే అరెస్టులు చేసి కేసులు నమోదు చేసిన వాళ్లు ఇలా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ దాడులకు కారణమై వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.