IPL 2025 MI VS GT Latest Updates: గుజరాత్ గుండె పగిలింది. టోర్నీలో అత్యంత నిలకడగా రాణించిన జీటీ పోరాటం శుక్రవారం తో ముగిసింది. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న జీటీ అనూహ్యంగా ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఎలిమినేట్ అవడంతో ఆ జట్టు అభిమానులు విలపిస్తున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ప్రత్యక్షంగా చూసిన వాళ్లతో టీవీ సెట్ల ముందు చూసిన కోట్లాది మందిలో చాలామంది గుండె బరువెక్కింది. ఇక స్టేడియంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. నిజానికి టోర్నీ ఆరంభమైనప్పటి నుంచి తమదైన ఆటతీరుతో ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటూ వచ్చిన జీటీ.. టోర్నీ ఆఖరు దశలో అదృష్టం కలిసి రాక, టాప్ -2లో నిలవలేక పోయింది. తప్పక గెలవాల్సిన రెండు చివరి మ్యాచ్ లో ఓడిపోవడం గుజరాత్ కొంప ముంచింది. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఒక వారం విరామం రావడం ఆ జట్టు లయను దెబ్బ తీసింది. దీంతో ఆ జట్టు.. టోర్నీలో బిలో పార్ ప్రదర్శన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సైతం చివరి మ్యాచ్ లో ఓడిపోయింది.
చాలా ప్రత్యకతలు..
ఈ సీజన్ లో గుజరాత్ అద్భుతంగా రాణించింది. 14 మ్యాచ్ లు ఆడిన జీటీ.. 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో నిలిచింది. ఇక అత్యధిక వికెట్లు తీసే ఆటగాడికిచ్చే పర్పుల్ క్యాప్, అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ కిచ్చే ఆరెంజ్ క్యాప్ రెండూ గుజరాత్ సొంతమయ్యాయంటేనే అన్ని విభాగాల్లో గుజరాత్ దూకుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. టోర్నీలో 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ని సాయి సుదర్శన్ దక్కించుకోగా, 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ ను ప్రసిధ్ కృష్ణ దక్కించుకున్నాడు. ఇక ఎలిమినేటర్ లోనూ ఆ జట్టు గెలిచే లాగే కనిపించింది, అయితే చివరి దశలో ఒత్తిడికి తలొగ్గి, ముంబై కి తలవంచింది.
పంజాబ్ తో ఢీ..
రెండు నెలలకు పైబడి సాగుతున్న ఐపీఎల్లో ప్రస్తుతం బరిలో మూడు జట్లే మిగిలాయి. మరో రెండు మ్యాచ్ లలో టోర్నీ ముగియ నుంది. మూడుసార్లు రన్నరప్ ఆర్సీబీ.. ఇప్పటికే ఫైనల్ కు చేరుకుంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఇక ఆర్సీబీ కి ఫైనల్లో ప్రత్యర్థి ఎవరో తెలియాలంటే క్వాలిఫయర్ 2 విజేత ఎవరో తెలియాలి. ఈ మ్యాచ్ జూన్ 1న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇరజట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఏదేమైనా టోర్నీలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై.. ఫైనల్ కు చేరుకుని ఆరోసారి విన్నర్ గా నిలవాలని భావిస్తోంది. ఇక ఎప్పుడో 2014లో ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్.. తమ చాంపియన్ కలను నెరవేర్చుకోవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది.