Elon Musk OTT App: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్‌ల తరహాలోనే ఎలాన్ మస్క్ కూడా కొత్త టీవీ యాప్‌ను తీసుకువస్తున్నాడు. ఎలాన్ మస్క్ కొత్త టీవీ యాప్ నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర ఓటీటీ యాప్స్ తరహాలోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారులు ఎక్స్/ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా టీవీని యాక్సెస్ చేయగలరు.


ఆండ్రాయిడ్ టీవీ కోసం ఎక్స్ టీవీ యాప్ బీటా వెర్షన్ విడుదల అయిందని ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ బీటా వెర్షన్ ఎల్జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ డివైసెస్ కోసం లైవ్ అయింది. అయితే దీని లాంచ్ తేదీ గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదు. యూజర్లు ఎక్స్ టీవీలో అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు. దీని గురించి లాంచ్ తేదీ వరకు మరింత సమాచారం అందుబాటులోకి రావచ్చు.


గూగుల్ ప్లే స్టోర్‌లో లిస్ట్ అయిన వివరాలు, స్క్రీన్‌షాట్‌ల ప్రకారం ఎక్స్ టీవీ యాప్ కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ యాప్‌గా మారవచ్చు. ఇందులో మీకు ఇష్టమైన లైవ్ టీవీ ఛానెల్‌లు, వార్తలు, స్పోర్ట్స్, సినిమాలు, సంగీతం, వాతావరణానికి సంబంధించిన అప్‌డేట్‌లను మీరు పొందగలరు.






Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఎక్స్‌ టీవీ యాప్ ఫీచర్లు ఇవే...
వినియోగదారులు ఎక్స్‌ టీవీలో రీప్లే చేసే సదుపాయాన్ని కూడా పొందుతారు. అలాగే క్లౌడ్ స్టోరేజ్ ద్వారా వినియోగదారులు 72 గంటల వరకు షోలను స్టోర్ చేసుకోగలరు. ఈ యాప్ 100 గంటల వరకు ఉచిత డీవీఆర్ రికార్డింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.


లీక్ అయిన నివేదికల ప్రకారం ఎక్స్‌ టీవీ యాప్‌ని యాక్సెస్ చేయడానికి సబ్‌స్క్రిప్షన్ అవసరం కావచ్చు. అయితే ఇది లాంచ్ అయినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఇంతకుముందు ఎలాన్ మస్క్ ప్రీమియం ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. ఇందులో ఎక్స్ యూజర్లకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నారు.


ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక దానికి చాలా మార్పులు చేశాడు. ముఖ్యంగా దాని పేరునే మార్చేశాడు. ట్విట్టర్‌కు ఎక్స్ అని కొత్తగా పేరు పెట్టాడు. అంతే కాకుండా ఇంతకు ముందు సెలబ్రిటీలకు మాత్రమే అందుబాటులో ఉండే బ్లూ టిక్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఎవరైనా సరే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో బ్లూ టిక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు ట్విట్టర్‌లో చాలా మంది సాధారణ యూజర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే