‘గూగుల్ వన్’ అనే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సర్వీసును కంపెనీ అందిస్తుంది. దీని ద్వారా అదనపు స్టోరేజ్, గూగుల్ ఫొటోస్ ఎడిటింగ్ ఫీచర్ వంటి ఫీచర్లు, సర్వీసులను గూగుల్ అందిస్తుంది. అయితే దీనికి నెలవారీ నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను గూగుల్ వన్ ద్వారా మనదేశంలో అందిస్తుంది. అదే డార్క్ వెబ్ రిపోర్టింగ్ ఫీచర్.
గూగుల్ వన్ డార్క్ వెబ్ రిపోర్టింగ్ అంటే ఏంటి?
డార్క్ వెబ్ అనే పదం మనం ఇప్పటికే చాలా సార్లు విని ఉంటాం. కేవలం కొన్ని బ్రౌజర్ల ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇంటర్నెట్ యాక్టివిటీని ఎవరికీ తెలియకుండా, ప్రైవేట్‌గా డార్క్ వెబ్ ఉంచుతుంది. దీని ద్వారా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు కూడా సాగుతూ ఉంటాయి. ఎన్నో పెద్ద కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించిన డేటా డార్క్ వెబ్‌లో ఎన్నో సార్లు లీక్ అయింది.
ఒకవేళ మనకు సంబంధించిన డేటా డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్పే ఫీచర్‌ను గూగుల్ వన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ పేరు, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నంబర్, సోషల్ సెక్యూరిటీ నంబర్ (మనదేశంలో ఆధార్ అనుకోవచ్చు) వంటి సమాచారం డార్క్ నెట్‌లో ఉంటే మీకు వెంటనే సమాచారం వస్తుంది. గూగుల్ ప్రైవసీ పాలసీకి లోబడి కంపెనీ ఈ సమాచారాన్ని సేకరిస్తుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా?
ఇంతకు ముందు వరకు కేవలం అమెరికాలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మనదేశంలో కూడా దీన్ని తీసుకువచ్చారు. గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లకు దీనికి సంబంధించిన మెయిల్స్ రావడం కూడా మొదలైంది. దీన్ని గూగుల్ వన్ యాప్‌లో కూడా చూపిస్తున్నారు. ఒకవేళ మీకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.
1. మీ బ్రౌజర్‌లో గూగుల్ వన్ పేజీ ఓపెన్ చేయండి.
2. మీ గూగుల్ ఖాతాలో లాగిన్ అవ్వండి.
3. అక్కడ కనిపించే ‘Dark Web Report’ పేజీలోకి వెళ్లండి.
4. అనంతరం ‘Setup’పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను అందించాలి. ప్రస్తుతానికి సోషల్ సెక్యూరిటీ నంబర్ మానిటరింగ్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.
6. ఇక్కడ మానిటరింగ్ ప్రొఫైల్ సెట్ చేయండి.
7. తర్వాతి పేజీలో అడ్రస్ ఎంటర్ చేయండి.
8. అనంతరం ‘Done’పై క్లిక్ చేశాక ప్రాథమిక స్కాన్ ప్రారంభం అవుతుంది.
ఒకవేళ మీరు అందించిన డేటాకు సంబంధించి ఏమైనా డార్క్ వెబ్‌లో కనిపిస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు మనదేశంలో రూ.130 నుంచి ప్రారంభం కానున్నాయి. మీ డేటా డార్క్ వెబ్‌లో ఉందన్న డౌటనుమానం ఉంటే ఒకసారి ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని డౌట్ క్లియర్ అయ్యాక ప్లాన్ నిలిపివేయవచ్చు.
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial