టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 13 సిరీస్‌ను మరికొద్ది రోజుల్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన ఈ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నట్లు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ సిరీస్ ప్రీ ఆర్డర్లు, సేల్ డేట్లు సహా పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇప్పటివరకు విడుదలైన లీకుల ప్రకారం చూస్తే.. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉండనున్నాయి. ఈ నాలుగు మోడల్ ఫోన్లలో భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌పాండెడ్  ఎంఎంవేవ్ 5జీ సపోర్టుతో ఇవి రానున్నాయి. 


ఐటీ హోమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాలోని ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫీచర్లు ప్రచురితమయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు సంబంధించిన ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల సేల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. 


కలర్ ఇదేనా?
ఐఫోన్ 13 ఫోన్ ఇదేనంటూ పలు ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 13 సిరీస్.. సన్ సెట్ గోల్డ్ రంగుల్లో లభ్యం కానుందని తెలిపింది. అలాగే ఇందులో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.   



ఐఫోన్ 13 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో టీఎస్ఎంసీ 5 nm+ ప్రాసెస్ ఆధారంగా రూపొందిన యాపిల్ తర్వాతి జనరేషన్ ఏ15 చిప్ లను అందించనున్నారు. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లిడార్ (LiDAR) సెన్సార్‌తో రానున్నాయి. ఈ సెన్సార్‌ను లేటెస్ట్ జనరేషన్ ఐప్యాడ్ ప్రో, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్లలో అందించారు. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో ఫ్లూ రిస్ట్రిక్షన్స్ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో ఫేస్ ఐడీకి సంబంధించి కొత్త అప్‌డేట్ రావచ్చని సమాచారం. 


ప్రస్తుతం కోవిడ్ కారణంగా బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది. మాస్క్ ధరిస్తే ఫేస్ ఐడీ పనిచేయడం లేదు. దీని వల్ల ఫోన్ అన్‌లాక్ ప్రక్రియ కష్టతరమైంది. మాస్క్ తీయడం లేదా పాస్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా అన్‌లాక్ చేయగలుగుతున్నారు. దీనికి చెక్ పెట్టడానికి కొత్త ఫీచర్ రానుంది. మనం మాస్క్ పెట్టుకున్నా కూడా ముఖం గుర్తించేలా ఫ్రంట్ సైడ్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా ఫేస్‌ను గుర్తిస్తుంది. 


Also Read: Realme 8i, 8s: అదిరిపోయే ఫీచర్లతో రానున్న రియల్‌మీ 8ఐ, 8ఎస్.. వీటితో పాటు పాకెట్ స్పీకర్లు కూడా లాంచ్ అవుతున్నాయి..


Also Read: Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..