ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్‌మీ నుంచి ఎల్లుండి (సెప్టెంబర్ 9) లాంచ్ కానున్న రియల్‌మీ 8ఐ, 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ ఒక్కొక్కటిగా టీజర్ల రూపంలో రివీల్ చేస్తుండగా.. ఇంకొన్ని లీకుల ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఫోన్లతో పాటు బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లను కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మీ 8ఐ, 8ఎస్ ఫోన్లు, రియల్‌మీ ప్యాడ్లతో పాటు బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లను సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12.30 గంటలకు ఇండియాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
కోబుల్, పాకెట్ అనే రెండు బ్లూటూత్ స్పీకర్లు గతంలో మలేసియాలో విడుదలయ్యాయి. ఇప్పుడు వీటిని ఇండియాకు కూడా తెస్తున్నట్లు రియల్‌మీ టెక్ లైఫ్ ట్వీట్ చేసింది. కోబుల్ బ్లూటూత్ స్పీకర్లు ల్యూమినస్ లాన్యార్డ్ తో రానున్నాయి. ఇందులో 5 వాట్స్ డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్ ఉంటుంది. 1500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అందించారు.
రియల్‌మీ 8ఎస్ స్పెసిఫికేషన్లు..
మరో 48 గంటల్లో విడుదల కానున్న రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఒక్కొక్కటిగా టీజర్ రూపంలో రివీల్ చేస్తుంది. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుందని తెలిపింది. అలాగే ఇందులో 8జీబీ ర్యామ్ అందించినట్లు వెల్లడించింది. 'డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్' అనే కొత్త ఫీచర్ ఇందులో ఉండనుంది. దీని ద్వారా మనకు అదనంగా స్టోరేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యూనివర్సల్ బ్లూ, యూనివర్సల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ 8.8 ఎంఎం వెడల్పుతో చాలా సన్నగా ఉంటుందని, బరువు 191 గ్రాములని కంపెనీ తెలిపింది.
ఇందులో వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ప్రైమరీ కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ గా ఉంది. దీంతో పాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. రీఫ్రెష్ రేటు 90Hz గా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 33 వాట్స్ డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది.
రియల్‌మీ 8ఐ స్పెసిఫికేషన్లు..
రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ తో పనిచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 6.6 అంగుళాల డిస్ ప్లేతో ఇది రానుంది. రీఫ్రెష్ రేటు 120Hzగా, టచ్ శాంప్లింగ్ రేటు 180Hzగా ఉంటుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్ ఉంటుందని టిప్‌స్టర్లు పేర్కొన్నారు. డైనమిక్ ర్యామ్‌ను 10 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం ఉంటుంది. ఇది స్పేస్ బ్లాక్, స్పేస్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉండనుంది. దీంతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
Also Read: Amazon TV: అమెజాన్ నుంచి టీవీ! అక్టోబర్‌లో లాంచ్.. అలెక్సాతో పనిచేసే టీవీలో ఫీచర్లు ఏంటో తెలుసా?