దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఈ నెల 14న ఒక ముఖ్యమైన ఈవెంట్ నిర్వహించనుంది. "కాలిఫోర్నియా స్ట్రీమింగ్ (California Streaming)" పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. దీనికి సంబంధించి మీడియాకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో ఏమేం ఉత్పత్తులను రిలీజ్ చేస్తామనే విషయాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. యాపిల్.. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో తన కొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. దీంతో 14న జరగబోయే కార్యక్రమంలో యాపిల్ తన కొత్త ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ 14న రాత్రి 10.30కి జరగనుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7, ఎయిర్ పాడ్స్ 3 కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్‌లు..
యాపిల్ నుంచి ఏ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అనే 4 స్మార్ట్ ఫోన్స్‌ను యాపిల్ తీసుకురానుంది. ఈ మోడల్స్ లో కొత్తగా ‘లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈవో)’ అనే ఫీచర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టవిటీ ఫీచరుతో ఐఫోన్ 13 సిరీస్ రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేకపోయినా కూడా కాల్స్, మెసేజ్‌లు వంటివి చేసుకోవచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు.
భారీ కెపాసిటీ బ్యాటరీలు..
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలు అందించనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌పాండెడ్ ఎంఎంవేవ్ 5జీ సపోర్టుతో ఇవి రానున్నాయని సమాచారం. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు సంబంధించిన ప్రీ ఆర్డర్లు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతాయని చైనాకు చెందిన టిప్ స్టర్ వెల్లడించింది. వీటి సేల్ ఈ నెల 24 నుంచి మొదలవుతుందని తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది. ఐఫోన్ కొత్త సిరీస్ ఫోన్లు.. సన్ సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లో లభించనుందని తెలిపింది. ఇవి ఎంఎం వేవ్ 5జీ (mmWave 5G) సపోర్ట్‌తో రానున్నాయని సమాచారం.