ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి మాత్రమే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 14న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉందని చెప్పారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ (JNTUK) నిర్వహిస్తోంది.
ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,76,603 మంది అప్లై చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. గత నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇవి ఈ నెల 3, 6, 7 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మొత్తం 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 88,822 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. 78,066 మంది హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ నెల 18 నుంచి ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు..
ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్), బీఎస్సీ (అగ్రి), ఫార్మా డీ, బీ-ఫార్మసీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ కోర్సులలో అడ్మిషన్లు పొందవచ్చు.
ఇంటర్ వెయిటేజీ తొలగింపు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీలలో ప్రవేశాలకు ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. గతేడాది వరకు ఈ ప్రవేశ పరీక్షలలో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని.. ఈ ఏడాది దీనిని తొలగించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈఏపీసెట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also Read: ANGRAU Admissions 2021: ఏపీ వ్యవసాయ పాలిటెక్సిక్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే?