గోవా వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌  ఫీడర్‌ కార్పస్‌ క్రిస్టి టోర్నీ( WTT Feeder Corpus Christi) లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ(Sreeja Akula ) తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 94వ ర్యాంకర్‌ శ్రీజ 11-6, 18-16, 11-5తో అమెరికాకు చెందిన ప్రపంచ 46వ ర్యాంకర్‌ లిలీ చాంగ్‌పై అద్భుత విజయం సాధించింది. రెండుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీజ... తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన  శ్రీజకు రూ. 54 వేల ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఫైనల్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఆరంభం నుంచే సాధికారికంగా ఆడిన శ్రీజ లిలీ చాంగ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో 11-6తో ఆధిక్యం కనబరిచిన శ్రీజకు... రెండో గేమ్‌లో చాంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మూడో గేమ్‌లో చాంగ్‌ను కంగుతినిపించిన శ్రీజ టైటిల్‌ దక్కించుకుంది. 

 

ఈ గెలుపు అంత తేలిక కాదు....

శ్రీజ ఈ టోర్నీలో తనకంటే మెరుగైన ర్యాంకర్లను మట్టికరిపించి స్వర్ణం సాధించింది. తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న అమెరికా ప్యాడ్లర్‌ అమీ వాంగ్‌ను క్వార్టర్స్‌లో... సెమీస్‌లో జియాన్‌షాన్‌ జావోను శ్రీజ మట్టికరిపించింది. హోరాహోరీగా సెమీస్‌లో శ్రీజ 9-11, 11-5, 11-6, 10-12, 11-9తో జావోపై చిరస్మరణీయ విజయం సాధించింది.
  

 

కష్టానికి ప్రతిఫలమిది

ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌  ఫీడర్‌ కార్పస్‌ క్రిస్టి టోర్నీలో తొలిసారి టైటిల్‌ గెలువడం చాలా సంతోషంగా ఉందని శ్రీజ తెలిపింది. తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని... ఇది తొలి అంతర్జాతీయ టైటిల్‌ కావడం ప్రత్యేకంగా మారిందని వెల్లడించింది. క్వార్టర్స్‌, సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఉత్కంఠ విజయాల తర్వాత ఇది సొంతమైందని.. ఈ విజయాలు మరింత ఆత్మవిశ్వాసాన్ని  ఇచ్చాయని తెలిపింది.  శ్రీజ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ విజయం భారత మహిళల జట్టు 2024 ఒలింపిక్స్ కు అర్హత సాధించడానికి, అలాగే సింగిల్స్ ఈవెంట్ కు అర్హత సాధించడానికి కూడా సహాయపడుతుందని శ్రీజ అన్నారు. ఈ టైటిల్ భవిష్యత్తుపై తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, పారిస్ ఒలింపిక్స్ తో పాటు రాబోయే అన్ని టోర్నమెంట్ లకు సన్నద్ధం అయ్యేందుకు తెలంగాణ కొత్త ప్రభుత్వం తనకు సహకరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అక్కడ ఓడినా.. 

ఇటీవలే వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ దోహా కంటెండర్‌ టోర్నీలో శ్రీజ పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన శ్రీజ రెండో రౌండ్‌లో 14–12, 11–8, 11–7తో ఫ్రాన్స్‌కు చెందిన ఆద్రీ జరీఫ్‌పై గెలిచింది. అయితే మూడో రౌండ్‌లో శ్రీజ 5–11, 10–12, 9–11తో చైనీస్‌తైపీకి చెందిన చెన్‌ జు యు  చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో శ్రీజ–యశస్విని ద్వయం 6–11, 7–11, 5–11తో జియాన్‌ టియాని–చెన్‌ జింగ్‌టాన్‌ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.