WFI Membership Suspended:
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) మరోసారి షాకిచ్చింది! భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేసింది. సరైన సమయంలో సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్ సమాఖ్యను వేర్వేరు వివాదాలు వెంటాడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. వాస్తవంగా 2023 జూన్‌లోనే ఎన్నికలు జరగాల్సింది. కొందరు రెజ్లర్లు ఆందోళనకు దిగడం, రాష్ట్ర సంఘాలు లీగలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాయిదా పడ్డాయి. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య భారత్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం వల్ల రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెజ్లర్లు జాతీయ పతాకం కింద ఆడలేరు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఒలింపిక్ అర్హతకు ఎంతో కీలకం. ఇలాంటి కీలక టోర్నీలో రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. సెప్టెంబర్ 16 నుంచి పోటీలు మొదలవుతాయి. ప్రస్తుతం భారత రెజ్లింగ్ సమాఖ్యను భూపిందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ సమాఖ్యను నడిపిస్తోంది. 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దాంతో సభ్యత్వంపై వేటు పడింది.
మొత్తం 15 పదవులకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సింది. సోమవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం బయటకు వెళ్తున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ సైతం ఇందులో ఉన్నారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. చండీగఢ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌కు చెందిన దర్శన్ లాల్ సెక్రటరీ పదవికి నామినేట్ అయ్యారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్పీ దేస్వాల్ ట్రెజరర్ పదవికి నామినేట్ అయ్యారు. ఆయన బ్రిజ్ భూషణ్ క్యాంప్ అభ్యర్థే. భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెండ్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. జనవరిలోనే నిషేధం విధించింది. రెజ్లర్లు ఆందోళనకు దిగడంతో మే నెలలో వేటు వేసింది.