Chandrayaan 3: ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి చంద్రుడిపైనే. జాబిల్లిపై ఏం ఉంది?. ఏ వాయువులు ఉన్నాయి? ఏ ఖనిజాలు ఉన్నాయి? మానవాళి నివాసానికి అనుకూలమా కాదా? అక్కడ నీరు ఉందా? ఉంటే ఎలా ఉంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రుడిపై ఇల్లు కట్టుకోవచ్చా, నీరు ఉందా? గాలి ఉందా? అనే ప్రశ్నలు కోకొల్లలు. చంద్రుడిపైకి మేము ప్రయోగం చేశాం, మాకే సొంతం అనడం కుదరదు. చంద్రుడిపై ప్రయోగం చేసిన దేశాలు చందమామ తమకే సొంతం అనడానికి వీళ్లేదు. అందుకు అంతర్జాతీయ చట్టాలు అంగీకరించవు.
దక్షిణ ధుృవంలోనే ప్రయోగాలు ఎందుకు?
1960వ దశకంలోనే, మొదటి అపోలో ల్యాండింగ్‌కు ముందు, చంద్రునిపై నీరు ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహించారు. 1960 చివర, 1970 ప్రారంభంలో అపోలో సిబ్బంది అక్కడ లభించిన పొడి మట్టి నమూనాలను ప్రయోగాల కోసం తీసుకొచ్చారు. 2008లో, బ్రౌన్ యూనివర్శిటీ పరిశోధకులు కొత్త సాంకేతికతతో ఆ చంద్ర నమూనాలను పరిశీలించారు. అందులో అగ్నిపర్వత శిథిలాల్లోని చిన్న పూసల లోపల హైడ్రోజన్‌ను కనుగొన్నారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-1లోని నాసా నాసా పరికరం చంద్రుని ఉపరితలంపై నీటిని గుర్తించింది.
అదే సంవత్సరంలో, దక్షిణ ధ్రువాన్ని తాకిన మరో NASA పరికరం చంద్రుని ఉపరితలం క్రింద నీటి మంచును కనుగొంది. మునుపటి NASA మిషన్, 1998 లూనార్ ప్రాస్పెక్టర్, దక్షిణ ధ్రువం నీడతో కూడిన క్రేటర్లలో నీటి మంచు ఉన్నట్లు గుర్తించారు. చంద్రుడి మీద నీటిని గుర్తించగలిగితే.. అది భవిష్యత్ ప్రయోగాలకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. దాని నుంచి ఆక్సిజన్ కూడా తయారు చేసుకోవచ్చు. అది అక్కడ మానవ నివాసానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
జాబిల్లి ఎవరి సొత్తు కాదు
చంద్రుడి మీదనే అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రయోగాలు చేసేందుకు అవసరమైన ప్రొపెల్లంట్‌గా కూడా ఆక్సిజన్ ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే ఇస్రో మొదటి నుంచి చంద్రుడి దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగింది. వరుసగా వ్యోమనౌకలను పంపుతున్నాయి. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. జాబిల్లి ఏ దేశం సొత్తు కాదని చెబుతున్నాయి.
1966లో ఐక్యారాజ్యసమితి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఔటర్ స్పేస్ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశం సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావనే ఉంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా అన్నదానిపై స్పష్టతలేదు. ఇందులో 27 దేశాలు సంతకాలు చేశాయి. చైనా, రష్యా మాత్రం అందుకు అంగీకరించలేదు. సంతకాలు చేయలేదు.
1979లో మూన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చంద్రుడిని తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని, జాబిల్లి మాకే సొంతం అంటే కుదరదు. చందమామ, అక్కడి సహజవనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది. అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు.
అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా, చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడమే లక్ష్యంగా 2020లో అమెరికా అర్టెమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఇందులో కెనడా, జపాన్, ఐరోపా భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ కూడా ఇటీవల ఇందులో చేరింది.