ఇండియన్‌ ప్రీమియర్‌ లీగుకు అంతర్జాతీయంగా ఎంత క్రేజ్‌ ఉందో  చెప్పేందుకు మరో ఉదాహరణ! ఫుట్‌బాల్‌ దిగ్గజ క్లబ్‌ 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు ఆసక్తి ప్రదర్శిస్తోందని తెలిసింది. బీసీసీఐ నుంచి ఐటీటీ పేపర్స్‌నూ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలియడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.


అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' క్లబ్‌ తెలియనివారు ఉండరు. ఇంగ్లిష్ ప్రీమియర్‌ లీగుకు చెందిన ఈ క్లబ్‌కు యజమానులు మాత్రం అమెరికాలోని గ్లేజర్‌ కుటుంబం. భారత్‌లోని ఓ ప్రైవేటు ఈక్విటీ కంపెనీ ద్వారా వారు ఐటీటీ పత్రాలు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌ సమాచారాన్ని వారు ఎప్పట్నుంచో కనుక్కుంటున్నారని వినికిడి.


వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు ఎనిమిది జట్లతో జరుగుతున్న లీగు 2022 నుంచి పది జట్లతో సాగుతుంది. ఈ ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ ఆసక్తిగల వారి నుంచి బిడ్డింగులను ఆహ్వానించింది. ఇందుకోసం ఇన్విటేషన్‌ టు టెండర్‌ పత్రాలను రూ.పది లక్షల ఫీజుతో కొనుక్కోవాలని సూచించింది. ఆ తర్వాత ఆసక్తిదారులతో వేలం నిర్వహించనుంది. ఒక్కో జట్టుకు కనీస ధర రూ.2000 కోట్లుగా అనుకుంటున్నా  దాదాపు రూ.3000 కోట్ల పైచిలుకు ధర రావొచ్చని అంచనా వేస్తున్నారు.


అహ్మదాబాద్‌ వేదికగా ఒక ఫ్రాంచైజీ ఉండనుంది! ఇండోర్‌, ధర్మశాల, భువనేశ్వర్‌, గువాహటి, తిరువనంతపురంలో ఏదో ఒకటి మరో ఫ్రాంచైజీ తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అదానీ గ్రూప్‌, టొరెంట్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌ మీడియా, జిందాల్‌ స్టీల్‌, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా మరో ముగ్గురు ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్స్‌ ఐటీటీ పత్రాలు తీసుకున్నవారిలో ఉన్నారు. మరి ఇంత కఠినమైన పోటీలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ నెగ్గుతుందా చూడాలి!!


Also Read: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఏస్ పేసర్.. ఐపీఎల్‌లో ఏ టీంకు ఆడాడంటే?


Also Read: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


Also Read: షాక్‌..! బీసీసీఐ ఆఫర్‌ తిరస్కరించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఎందుకంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి