World Athletics Championships: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రో తో పాటు పతకం మీద ఆశలు రేపిన మరో ఈవెంట్ 4x400 మీటర్ల పరుగుపందెం. ఈ పోటీలలో భాగంగా క్వాలిఫై రౌండ్‌లోని హీట్స్‌లో మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఆసియా రికార్డు నెలకొల్పి ఫైనల్స్‌కు అర్హత సాధించినా తుదిపోరులో మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోయి చతికిలపడింది.
హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన పురుషుల 4x400 మీటర్ల రిలేలో భారత బృందం ఐదో స్థానానికి పరిమితమైంది. అజ్మల్, రాజేశ్, అమోజ్, అనాస్‌లు.. 2 నిమిషాల 59.34 సెకన్లలో పరుగును పూర్తి చేశారు. అమెరికా అథ్లెట్ల బృందం.. 2 నిమిషాల 57.31 సెకన్లలోనే పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కించుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఫ్రాన్స్ (2 నిమిషాల 58.45 సెకన్లు), గ్రేట్ బ్రిటన్ (2 నిమిషాల 58.71 సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జమైకా అథ్లెట్ల బృందం.. 2 నిమిషాల 59.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల క్వాలిఫై రౌండ్‌లో భారత బృందం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి రెండో స్థానంలో నిలవడంతో భారత్‌కు పతకం మీద ఆశలు రేగాయి. క్వాలిఫై రౌండ్‌లో ఈ నలుగురు పరిగెత్తిన వేగానికి గతంలో ఈ విభాగం (4X400)లో జపాన్ పేరిట ఉన్న రికార్డు (2 నిమిషాల 59.51 సెకన్లు) కూడా బద్దలైంది. కానీ ఫైనల్ పోరులో భారత బృందం ఆ వేగాన్ని చూపలేకపోయింది.
స్టీపుల్‌ఛేజ్‌లో పరుల్ చౌదరి కొత్త రికార్డు..
పతకం గెలవకున్నా మరో భారత అథ్లెట్ పరుల్ చౌదరి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రికార్డు సృష్టించింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో ఆమె 9 నిమిషాల 15.51 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి జాతీయ స్థాయిలో కొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు.. మహారాష్ట్రకు చెందిన లలితా బాబర్ పేరిట (9 నిమిషాల 19.76 సెకన్లు) ఉండేది. వరల్డ్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో పరుల్ 11వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించినట్టైంది.
నీరజ్ చోప్రా ఒక్కడే..
ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ పోరులో ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా 88.17 మీటర్ల త్రో తో స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఈ పోటీలలో భారత్ బోణీ కొట్టినట్టైంది. పతకాల పట్టికలో భారత్‌కు ఎంట్రీ దక్కింది. పతకాల పట్టికలో యూఎస్ఎ ఇప్పటివరకూ 29 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో కెనడా, స్పెయిన్, జమైకా, కెన్యా, బ్రిటన్, ఇథియోపియాలు నిలిచాయి. ఒకే ఒక్క పతకం సాధించిన భారత్.. 18వ స్థానంలో ఉంది. ఈ పోటీలకు 27 మంది బృందంతో వెళ్లిన టీమిండియా.. ఒక్క పతకంతోనే సరిపెట్టుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial