Nikhat Zareen Wins Gold : నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన వియత్నామీస్ బాక్సర్ థీ టామ్‌పై నిఖత్ జరీన్ గెలుపొందింది. ఆదివారం న్యూదిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48-50 కిలోల ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ వియత్నాంకు చెందిన న్గుయెన్ థీ టామ్‌పై గెలిచి స్వర్ణం సాధించింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణాల వేట కొనసాగింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ రెండు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా తాజాగా తన ఖాతాలో మరో స్వర్ణాన్ని వేసుకుంది. 48-50 కిలోల విభాగంలో తెలుగు తేజం నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలిచింది. రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న వియత్నామీస్ బాక్సర్ థీ టామ్ పై 5-0తో విజయం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది నిఖత్.
భారత బాక్సర్ నిఖత్.. ఎటాకింగ్ నోట్‌తో బౌట్‌ను ప్రారంభించింది. నిఖత్ తన ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. కోచ్ నిరంతరం దూరం ఉండు, దగ్గరగా వెళ్లొద్దు అని చెబుతూ గైడెన్స్ ఇవ్వడంతో నిఖత్ సరిగ్గా అదే ఫాలోఅయింది. సురక్షితమైన దూరాన్ని కొనసాగిస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా పంచ్ లు విసిరింది. మొత్తం ఐదుగురు జడ్జెస్ ఓపెనింగ్ రౌండ్‌లో నిఖత్ కు అనుకూలంగా పాయింట్స్ ఇచ్చారు. వియత్నాం బాక్సర్ థీ టామ్ రెండో రౌండ్‌లో అద్భుతంగా కోలుకుంది కానీ నిఖత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. థీ టామ్ తదుపరి రౌండ్‌ను 3-2తో చేజిక్కించుకుంది. ఆఖరి రౌండ్‌లో బాక్సర్లిద్దరూ మరోసారి నెక్ అండ్ నెక్ పోటీ ఇచ్చారు. కానీ నిఖత్ దూరాన్ని కొనసాగిస్తూ అఫెన్స్ డిఫెన్స్ ల కలయికతో వియాత్నాం బాక్సర్ బోల్తా కొట్టింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నీతూ ఘంఘాస్ తర్వాత సవీటీ బూరా కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది. 81 కేజీల విభాగంలో సవీటీ బూరా బంగారు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాను సవీటీ బూరా ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకు ముందు మంగోలియన్ బాక్సర్‌ను ఓడించి నీతు ఘంఘాస్ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. ఇప్పుడు సవీటీ బూరా చైనా క్రీడాకారిణిని ఓడించి రెండో స్వర్ణ పతకాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. నీతూ ఘంఘాస్ 48 కిలోల బరువు విభాగంలో స్వర్ణం సాధించింది.