Ravindra Jadeja CSK: ఐపీఎల్‌లో  సుమారు దశాబ్దకాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న  రవీంద్ర జడేజా ఈసారి ఆ ఫ్రాంచైజీకి ఆడుతుండటం సీఎస్కే అభిమానుల్లో జోష్ నింపుతున్నది.  ప్రస్తుతం సీఎస్కే షేర్ చేస్తున్న ఫోటోలు వారికి ఆనందాన్ని పంచుతున్నాయి. కానీ  జడ్డూ.. మళ్లీ సీఎస్కేకు ఆడటం అంతా ఆషామాషీగా  జరుగలేదు.  గతేడాది ఐపీఎల్ సీజన్ కు ముందు  జడ్డూను  సీఎస్కే సారథిగా నియమించడం.. అతడు ఆడిన 8 మ్యాచ్ లలో అతడు ఒక్క మ్యాచ్‌నే గెలిపించడం.. రవీంద్రుడి ప్రదర్శన కూడా దారుణంగా ఉండటంతో  సీజన్ మధ్యలోనే   సారథ్య పగ్గాలు మళ్లీ  ధోనినే తీసుకున్నాడు.  ఆ తర్వాత చాలా తతంగం జరిగింది.   ఈ సీజన్ లో జడేజా.. మళ్లీ చెన్నై తరఫున ఆడటానికి  జార్ఖండ్ డైనమైట్, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి  ధోనీనే కారణం.. 


అప్పుడు ఏం జరిగింది..? 


2022 సీజన్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు ధోని (అదే లాస్ట్ సీజన్ అని ప్రచారం జరిగింది)  రవీంద్ర జడేజాకు  సీఎస్కే సారథ్య పగ్గాలు అప్పజెప్పాడు. ధోని వారసుడు  జడ్డూయేనని సీఎస్కే అభిమానులు సోషల్ మీడియాలో నానా రచ్చ  చేశారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధం.  కెప్టెన్ గా 8 మ్యాచ్ లు ఆడిన  జడ్డూ.. ఒక్క మ్యాచ్ లోనే సీఎస్కేను గెలిపించాడు.   సీజన్ సగానికి వచ్చేసరికి ముంబైతో పాటు  చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది.  ఇదే క్రమంలో   జడేజా.. సీఎస్కేకు నడిపించిన తీరు టీమ్ మేనేజ్మెంట్ కు నచ్చలేదని..  అతడిని తొలిగించేందుకు  రంగం సిద్ధమైందని వార్తలు వినిపించాయి. 


ఇద్దరి మధ్య విభేదాలు   పొడచూపాయని గుసగుసలూ కుప్పలుతెప్పలుగా వచ్చాయి. దీనికి కొనసాగింపా..? అన్నట్టుగా  8 మ్యాచ్ ల తర్వాత  జడేజాను తప్పించి తిరిగి ధోనికే  కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది సీఎస్కే. అదీగాక మరో నాలుగు మ్యాచ్ లు మిగిలుండగానే కాలిగాయం కారణంగా అతడు సీజన్ నుంచి తప్పుకున్నాడని సీఎస్కే ప్రకటన విడుదల చేసింది.   ఆ తర్వాత జడేజా.. చెన్నైకి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న ఫోటోలు తొలగించడం,   సీఎస్కే ట్విటర్ అకౌంట్ కూడా జడేజాను ఫాలో కాకపోవడం, ధోని బర్త్ డే కు టీమ్ మెంబర్స్ అందరూ విషెస్ చెప్పినా అందులో జడ్డూ లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.  ఇక జడ్డూ - చెన్నైల బంధం బీటలువారిందని, 2023 సీజన్ లో  అతడు వేలంలో  పాల్గొంటాడని  కూడా  వార్తలు వచ్చాయి.  


ధోని కూడా కారణమే..? 


వాస్తవానికి  సీజన్ మధ్యలో  జడేజా  తప్పుకోవడం  కాలి గాయం వల్ల కాదని, తనను అవమానించినందుకే (కెప్టెన్సీ తొలిగించి) అతడు    ఉన్నఫళంగా టీమ్ హోటల్ నుంచి వెళ్లిపోయాడట. దీంతోపాటు జడేజా సారథ్యం గురించి  ధోని చేసిన వ్యాఖ్యలు కూడా అతడు నొచ్చుకునేలా చేశాయట.  జడ్డూ నుంచి  తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాక ధోని..  ‘కెప్టెన్సీ భారాన్ని జడేజా మోయలేకపోతున్నాడు’ అని చేసిన వ్యాఖ్యలు కూడా అతడి అలకకు కారణమయ్యాయి.   తర్వాత జరిగిన పరిణామాలు  కూడా జడేజా - సీఎస్కే మధ్య   అగ్గికి ఆజ్యం పోశాయి. 


 






మహీ సెట్ చేశాడిలా.. 


జడేజా-చెన్నై మధ్య విభేదాల తర్వాత పలుమార్లు విశ్వనాథన్ ఈ  వివాదంపై మాట్లాడుతూ దాటవేత ధోరణి ప్రదర్శించాడు. కానీ సీఎస్కే యాజమాన్యం మాత్రం జడ్డూను తిరిగి టీమ్ లోకి రప్పించే బాధ్యతను ధోనికి అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో ధోని..  జడ్డూతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడట. ముంబైలో  జడేజా తో పాటు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తో కూడా వన్ టు వన్ మీటింగ్ లో ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీసిన విషయాలను చర్చించాడట.  ఇరు వర్గాల మధ్య ఉన్న అపార్ధాలను   తొలగించేందుకు ధోని చాలానే శ్రమించాడని   చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే   అసలు ధోని ఇద్దరి మధ్య ఎలా రాజీ కుదిర్చాడు అని చెప్పడానికి  కాశీ విశ్వనాథన్ నిరాకరించినా జడేజాను ఒప్పించి రాజీ కుదర్చడానికి చెన్నై సారథికి చాలా టైమ్ పట్టిందని సమాచారం.  సీఎస్కేకు పది సీజన్ల పాటు ఆల్  రౌండర్ గా సేవలందించిన జడ్డూ విలువ తెలిసిన ధోని.. ఓ మెట్టు దిగి అతడిని ఒప్పించినట్టు  సీఎస్కే వర్గాలలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏదేమైనా జడ్డూ తిరిగి టీమ్ తో చేరడం.. ఈసారి టీమ్ లో బెన్  స్టోక్స్, దీపక్ చహర్ వంటి ఆటగాళ్లు కలుస్తుండటంతో ఈసారి  కప్ కొట్టాలని సీఎస్కే లక్ష్యంగా పెట్టుకుంది. మరి తమిళ తంబీల కోరికను ‘తాలా  అండ్ కో.’ నెరవేరుస్తుందో చూడాలి.