ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే బెస్ట్ ఫేజ్‌లో ఉన్నారు. సినిమాల పరంగా బ్లాక్‌బస్టర్లు అందిస్తూ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. ‘అన్‌స్టాపబుల్ షో’ ద్వారా ఓటీటీలోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రీ మ్యాచ్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు స్టార్ గ్రూప్ బాలకృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్ గ్రూప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.


క్రీడ‌ల‌ను, వినోదాన్ని మిక్స్ చేసి "ఇన్‌క్రెడిబుల్ యాక్ష‌న్‌..ఆట అన్‌స్టాపబుల్" ద్వారా స్టార్‌స్పోర్ట్స్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త స్థాయిలో వినోదాన్ని అందించ‌నున్నారు. వేణుగోపాల్ రావు, ఎమ్మెస్కే ప్ర‌సాద్‌తో పాటు నందమూరి బాల‌కృష్ణ‌ ఈ సారి కామెంట‌రీ బాక్స్‌ను షేర్ చేసుకోబోతున్నారు. ఆయ‌న త‌న అస‌మాన శైలితో ఆట‌పై క్రీడాభిమానుల దృక్ప‌థానికి త‌గిన‌ట్లుగా ఉత్సాహ‌భ‌రితంగా కామెంట‌రీ అందించ‌నున్నారు. అంతేకాకుండా #AskStar ద్వారా అభిమానులు తొలిసారిగా నేరుగా టీవీ లైవ్‌లో పాల్గొనే అవ‌కాశం కూడా అందించనున్నారు.


స్టార్‌స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్ అవ‌టంపై నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ, "స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్‌ అవుతున్నందుకు ఓ క్రికెట్ అభిమానిగా సంతోషిస్తున్నాను. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్ చూస్తూ సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు అభిమానులు న‌న్ను స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. మార్చి 31వ తేదీన‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌పర్ట్స్‌తో జాయిన్ కాబోతున్నా. ఆ క్ష‌ణం కోసం నేను ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నా. మ‌న క్రికెట్ స్టార్స్ అందిరికీ నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను. అలాగే ఈ సీజ‌న్ మ‌నంద‌రికీ ప్ర‌త్యేకంగా నిలిచిపోవాల‌ని ఆశిస్తున్నాను." అన్నారు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు సరికొత్త సీజన్‌కు ఇంకెన్నో రోజుల్లేదు. మార్చి 31నే తొలి మ్యాచ్‌. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఎప్పట్లాగే ఈసారీ అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌ సహా చాలా జట్లలో కీలక ఆటగాళ్లు లేరు. ఇప్పటి వరకు ఎవర్నీ రీప్లేస్‌మెంట్‌గా భర్తీ చేయలేదు. ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


గతేడాది రన్నరప్‌ రాజస్థాన్‌ రాయల్స్‌. ఈ జట్టు విజయాలు సాధించడంలో టీమ్‌ఇండియా యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణది కీలక పాత్ర. గాయం వల్ల సుదీర్ఘ కాలం నుంచీ అతడు క్రికెట్‌ ఆడటం లేదు. అతడి స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌ సందీప్‌ శర్మను తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికే అతడు ఆర్‌ఆర్‌ క్యాంపులో ట్రైనింగ్‌ చేస్తున్నాడని సమాచారం. ఒకవేళ అతడిని తీసుకుంటే మంచి రిప్లేస్‌మెంటే అవుతుంది. ఈ వేలంలో సందీప్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. విండీస్‌ పేసర్‌ ఒబెడ్‌ మెకాయ్‌ కూడా ఆడటం లేదు.


ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్ పంత్‌ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఏడాది వరకు అతడు అందుబాటులో ఉండే అవకాశమే లేదు. దాంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకోవాలో దిల్లీకి అర్థమవ్వడం లేదు. మెంటార్‌ రికీ పాంటింగ్‌, డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీ కలిసి త్వరలోనే ఒకరిని ఎంపిక చేస్తారని తెలిసింది. వికెట్‌ కీపర్‌గా ఫిల్‌సాల్ట్‌ ఉన్నా రిషభ్ స్థాయి బ్యాటర్‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.