Novak Djokovic: 


టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకు తిరుగులేదని చాటి చెప్తున్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. తాజాగా 350వ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయం అందుకున్నాడు. వింబుల్డన్‌ మ్యాచులో జోర్డాన్‌ థాంప్సన్‌ను ఓడించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జకోకు ప్రత్యర్థి నుంచి కఠిన సవాల్‌ ఎదురైంది. అయితే కీలక సమయాల్లో ఎదురు నిలిచిన అతడు 6-3, 7-6(4), 7-5 తేడాతో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.


ఈ విజయంతో నొవాక్‌ జకోవిచ్‌ దిగ్గజాల సరసన నిలిచాడు. రోజర్ ఫెదరర్‌, సెరెనా విలియమ్సన్‌ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు వీరిద్దరు మాత్రమే 350 గ్రాండ్‌స్లామ్‌ విజయాల ఘనత అందుకోవడం గమనార్హం. ఇక తన ట్రేడ్‌ మార్క్‌ కచ్చితత్వం, నిలకడతో జకో మరిన్ని ఘనతలపై కన్నేశాడు. వయసు తనకు అడ్డంకేమీ కాదని చెప్తున్నాడు. ఇంకా మరిన్ని మ్యాచులు, టోర్నీలు ఆడతానని స్పష్టం చేశాడు.


Also Read: అదృష్టం వల్లే కపిల్‌ డెవిల్స్‌ '1983' గెలిచిందన్న ఆండీ రాబర్ట్స్‌!


'మనం ఎలా భావిస్తే మన శరీరం అలా ఉంటుంది. యంగ్‌, ఓల్డ్‌ అనేది మనసును బట్టే ఉంటుంది. నా శరీరం, హృదయం, మనసు అన్నీ యుక్త వయసులో ఉన్నాయనే అనుకుంటాను. నేను వారితో గడిపినప్పుడల్లా నా పిల్లలు నాకిది గుర్తు చేస్తుంటారు. అమాయకత్వం, అంతులేని ఆసక్తి, స్వచ్ఛమైన ప్రేమ, శక్తి వారి నుంచి తెచ్చుకుంటాను.  వాళ్లతో గడిపినప్పుడుల్లా నా హృదయంలోని చిన్న పిల్లాడు బలంగా మారుతుంటాడు' అని జకో అన్నాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


'చాలా చిన్న వయసులోనే టెన్నిస్‌తో ప్రేమలో పడ్డాను కాబట్టే ఇంకా ఆడుతున్నాను. అదే నన్నెప్పుడూ తాజాగా ఉంచుతుంది. నా శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం ఆశీర్వాదంగా ఫీలవుతాను. అందుకే 20 ఏళ్లుగా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆడుతున్నా ఇంకా అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నాను' అని జకో తెలిపాడు. 2018 నుంచి అతడు గ్రాస్‌ కోర్టులో ఓటమి చవిచూడలేదు. క్వీన్‌క్లబ్‌ ఫైనల్లో మారిన్‌ సిలిక్‌ను ఓడించినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 మ్యాచులు గెలిచాడు. తాజా మ్యాచులో థాంప్సన్‌ తనను ఇబ్బంది పెట్టాడని అంగీకరించాడు.