YSRCP News :  అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని విభేదాలకు చెక్ పెట్టకపోతే మొదటికే మోసం వస్తుందన్న  నివేదికలు అందడంతో సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బుజ్జగింపులతో దారిలోకి వస్తున్న నేతలకు సర్ది చెప్పి.. మాట వినని  సస్పెండ్ చేస్తున్నారు. అనంతపురంలో ఒక్క రోజే కీలకమైన నేతను సస్పెండ్ చేయడంతో పాటు.. ఎవరూ ఊహించని విధంగా ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ ను ప్రకటించారు. 


వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పార్టీ నుంచి సస్పెండ్ 
 
వైఎస్ఆర్‌సీపీ   రాష్ట్ర కార్యదర్శి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.  అదే విధంగా రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలి భర్త, మాజీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి, ఆయన తనయుడు ప్రణరుపై గత కొన్ని రోజులుగా భూ అక్రమాణ ఆరోపణలను మధుసూదన్ రెడ్డి చేస్తున్నారు.  పార్టీ నాయకులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఆరోపణలు చేసిన మధుసూదన్‌రెడ్డిపై వేటువేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే  ఏప్రిల్‌లో  ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పర్యటన నార్పలలో జరిగిన సమయంలో ఆయన్ను కలువకుండా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆయన భర్త విద్యాశాఖ సలహదారు సాంబశివారెడ్డి అడ్డుకున్నారంటూ చామలూరు రాజగోపాల్‌ ఆరోపించారు. బహిరంగ ఆరోపణలు చేసినందకు ఆయనకూ నోటీసులు జారీ చేశారు. సమాధానం చెప్పకపోతే సస్పెండ్ చేసే అవకాశం ఉంది. 


అనంతపురం జిల్లాపై మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి 
 
 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో  పార్టీలో గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నెలలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమై వివరాలు సేకరించారు. దీని ఫాలోఆప్‌గానే గత వారంలో తిరుపతిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా సమావేశమై సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు అన్నీంటిపైనా చర్చించారు. అనంతరం వరుసగా పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టడం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది.  వివాదాలున్న మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తీరున చర్యలుంటాయా అన్నది కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల సమయం వచ్చే సరికి వివాదాలకు పుల్‌స్టాప్‌ పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. 


హిందూపురం తరహాలో  మరికొన్ని నియోజవకర్గాలకు ఇంచార్జులను మారుస్తారా ?                           


మంగళారం నాడు హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానున్న మహమ్మద్‌ ఇక్బాల్‌ స్థానంలో దీపికారెడ్డిని నియమించారు. అక్కడ నేతలు  వర్గ పోరాటంలో మునిగి తేలుతున్నారు. హిందూపురం మార్పు జరిగిన మరుసటి రోజే మరో ఇద్దరిపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైంది. వారందరికీ వార్నింగ్ ఇచ్చినట్లయింది.  ఏవర్నీ ఉపేక్షించబోమని చెప్పినట్లయిందని అంటున్నారు.