Wimbledon 2023 Winner: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో స్పానిష్ యువ సంచలనం కార్లొస్ అల్కరాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లొస్ అల్కరాస్ 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాతో సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ పై ఉత్కంఠ పోరులో గెలుపొందాడు. ఓపెన్ టెన్నిస్ లో 2వ మేజర్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన 5వ పిన్న వయస్కుడు అల్కరాస్. ఓపెన్ ఎరాలో బేకర్, Bjorg తరువాత వింబుల్డన్ నెగ్గిన మూడో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు అల్కరాస్. గ్రాండ్ స్లామ్ ఫైనల్లో జకోవిచ్ ను ఓడించిన రెండో అతిపిన్న వయస్కుడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తన పట్టుదలతో అనుభవాన్ని ఓడించాడు యువ కెరటం అల్కరాజ్.
పురుషుల టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (23) దక్కించుకున్న నొవాక్ జకోవిచ్ ను ఫైనల్లో ఓడించడం అంత ఈజీ కాదు. వింబుల్డన్ విజేతగా నిలవడంతో అల్కరాస్ కెరీర్ లో రెండో గ్రాండ్ స్లామ్ చేరింది. గతేడాది యూఎస్ ఓపెన్ అల్కరాస్ కెరీర్ లో తొలి మేజర్ టైటిల్. భారత కాలమానం ప్రకారం.. నేటి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన సింగిల్స్ ఫైనల్ దాదాపు నాలుగున్నర గంటలపాటు హోరాహోరీగా సాగింది. ఫైనల్ కావడంతో సెర్బియా స్టార్ జకోవిచ్ గానీ, స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ ఏ దశలోనూ తగ్గినట్లు కనిపించలేదు. మరో టైటిల్ నెగ్గి టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన దిగ్గజ టెన్నిస్ తార మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను సమం చేయాలనుకున్న జకోవిచ్ కు నిరాశే ఎదురైంది.
వరుసగా నాలుగు ఫైనల్స్ లో విజయం.. ఈసారి మిస్
జకోవిచ్‌కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఎదురులేదు. 2018 నుంచి జరిగిన వరుసగా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. దాంతో ఈ ఫైనల్ సైతం జకో నెగ్గుతాడని అంతా భావించారు. వరుసగా ఐదో వింబుల్డన్ నెగ్గి టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సమం చేయాలని భావించిన జకోవిచ్ కు యువ ఆటగాడు అల్కరాస్ షాకిచ్చాడు. మరోవైపు 2013 నుంచి ఈ టోర్నీలో 10 ఫైనల్స్ ఆడితే అందులో 7 టైటిల్స్ జకోవే. అతడి కెరీర్ లో ఆస్ట్రేలియా ఓపెన్ (10) తర్వాత అత్యధికంగా వింబుల్డన్‌లో ఏడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. అయితే వింబుల్డన్ లో అత్యధిక టైటిల్స్ స్విట్జర్లాండ్ వెటరన్ రోజర్ ఫెదరర్ (8) ఖాతాలో ఉన్నాయి.
2008లో స్పెయిన్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ సైతం తన తొలి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ను 5 సెట్ల ఉత్కంఠ పోరులో నెగ్గాడు. తాజాగా యువ సంచలనం అల్కరాస్ సైతం జకోవిచ్ తో హోరాహోరీగా జరిగిన 5 సెట్ల ఫైనల్లో గెలిచి మాజీ నెంబర్ వన్ కు రికార్డు టైటిల్ దూరం చేశాడు. సరికొత్త టెన్నిస్ స్టార్ అవతరించాడంటూ టెన్నిస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial