WFI Row:


భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రజ్ భూషణ్‌ సింగ్‌పై ఉచ్చు బిగుస్తోంది! కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత అన్షు మలిక్‌ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పోటీలు జరిగేటప్పుడు ఆయన ప్రతి అమ్మాయిని అసౌకర్యానికి గురిచేసేవాడని వెల్లడించింది. జూనియర్‌ అమ్మాయిలు బస చేసిన హోటల్‌ ఫ్లోర్‌లోనే ఆయనా పడుకొనేవాడని తెలిపింది ఆయన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని స్పష్టం చేసింది.


'జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ సమయంలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు జూనియర్‌ అమ్మాయిల గదుల వద్దే బస చేసేవారు. మా గదులకు అడ్డంగా ఉండేవారు. అంతేకాకుండా ఆయన గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. దాంతో ప్రతి అమ్మాయి అసౌకర్యంగా భావించేది' అని అన్షు మలిక్‌ ఆరోపించింది. 'అందుకే మేం సమాఖ్యను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం' అని వెల్లడించింది.






ఒలింపిక్ పతక విజేతలు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియా సహా ప్రధాన రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రజ్‌ భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయన్ను వెంటనే సమాఖ్య నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సమాఖ్యనూ రద్దు చేయాలని కోరుతున్నారు. ఆయన వల్ల ఎంతో మంది మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని వినేశ్‌ ఫొగాట్‌ స్పష్టం చేసింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.


'ఆరోపణలు నిజం కాబట్టే మేమిక్కడ ఆందోళన చేస్తున్నాం. బ్రజ్‌ భూషణ్‌ సింగ్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు అమ్మాయిలు మాతో ఉన్నారు. ఇప్పుడు మరింత మంది వచ్చి చేరుతున్నారు. మమ్మల్ని అనవసరంగా రెచ్చిగొడితే మిమ్మల్ని జైలుకు పంపిస్తాం. మేం వారిని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. విచారణ చేపట్టేందుకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం' అని వినేశ్‌ ఫొగాట్‌ హెచ్చరించింది.


Also Read: 'అతని ఇన్నింగ్స్ అత్యుత్తుమంగా నిలుస్తుంది'- గిల్ డబుల్ సెంచరీపై సహచరుల వర్ణన


బ్రజ్‌ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో క్రీడారంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లను కలిసి మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు బ్రజ్‌ భూషణ్‌ రాజీనామా ఇచ్చేంత వరకు ఆందోళన ఆపబోమని కుస్తీ క్రీడాకారులు స్పష్టం చేశారు.