IND vs NZ 1st ODI: 'అద్భుతం', 'అవుట్ ఆఫ్ ది వరల్డ్', 'చాబుక్', 'ప్యూర్ క్లాస్', 'ట్రీట్ టు వాచ్'... ఇవీ భారత క్రికెట్ జట్టు సభ్యులు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీని వర్ణించడానికి ఉపయోగించిన పదాలు. హైదరాబాద్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల క్రికెటర్ గిల్ డబుల్ సెంచరీతో అలరించాడు. కేవలం 149 బంతుల్లో 208 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 19 బౌండరీలు, 9 సిక్సర్లు ఉన్నాయి. భారత్ కివీస్‌పై 12 పరుగుల తేడాతో విజయం సాధించడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ కు డ్రెస్సింగ్ రూమ్ లో ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది గిల్ చేత కేక్ కట్ చేయించారు. అతని స్పెషల్ ఇన్నింగ్స్ కు గుర్తుగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అలాగే జట్టు సహచరులు అతని ఇన్నింగ్స్ గురించి మాట్లాడారు.
శుభ్ మన్ ఇన్నింగ్స్ గురించి జట్టు సభ్యులు చెప్పిన మాటలు..
గూస్ బంప్స్ వచ్చాయి
'నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఇది ఒకటి. అతను డబుల్ సెంచరీ అందుకోకపోయినా ఇది ఉత్తమ ఇన్నింగ్సుల్లో ఒకటిగా నిలిచేది. అతను ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా నేను ఉద్వేగానికి లోనవను. అయితే గిల్ ఇన్నింగ్స్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.' అని భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు.
అద్భుతమైన నాక్
'గిల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ను నేను అత్యుత్తమంగా చూస్తాను. అతని తర్వాత అత్యధిక స్కోరు 40 కూడా లేదు. కాబట్టి అతను చేసిన డబుల్ సెంచరీ ఉన్నత స్థానంలో ఉంటుంది. అతను ఈరోజు ఫుల్ టచ్ లో ఉన్నాడు. గిల్ గురించి అభిమానులు ఎందుకు గొప్పగా చెప్పుకుంటారో ఈరోజు అతను చూపించాడు. గిల్ కు శుభాకాంక్షలు. ఇది అత్యద్భుతమైన నాక్'. అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. అతను ముందు ముందు మరెన్నో ఘనతలు సాధించాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. గిల్ డబుల్ సెంచరీతో కివీస్ ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. న్యూజిలాండ్ బ్యాటర్ మైఖెల్ బ్రాస్ వెల్ 78 బంతుల్లో 140 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు.