చేపలు ఆరోగ్యానికి మంచివే. చేపల్లో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. అయితే ఏదైనా సరే ‘అతి’ పనికిరాదు. చేపలకు కూడా అదే వర్తిస్తుంది. చేపలు అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి.
చేపలు తినడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్యలు రావు అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రాణాంతకంగా పరిణమించే పెరిఫ్లోరోఆల్కలైన్ అనే పదార్థాలు క్యాన్సర్ కు కారణం కావచ్చు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. PFAS అనే ఈ రసాయనం నాన్ స్టిక్ వంట పాత్రల్లో వాడే టెఫ్లాన్ కోటింగ్ లో ఉంటుందని, దాని వల్ల చాలా రకాల అనారోగ్యాలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వంటకు ఇవి వాడకూడదని ఈ మధ్య కాలంలో ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే రసాయనాన్ని అమెరికా శాస్త్రజ్ఞులు చేపల్లో కూడా గుర్తించారు. ఇది కేవలం క్యాన్సర్ కారకం మాత్రమే కాదు.. కోలెస్ట్రాల్ పెరుగుదల, సంతాన సాఫల్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలకు కూడా కారణం అవుతోందట.
ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ కి చెందిన శాస్త్రవేత్తలు యూఎస్ లోని మంచి నీటి చేపలలో PFAS అవశేషాలు ఒక మోతాదు వరకు గుర్తించారు. అయితే కమర్షియల్ గా పెంచిన చేపలలో కంటే కూడా ఈ హానికరమైన రసాయనం 280 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని సమాచారం.
పరిశోధనల ప్రకారం ఒక్క పూట మంచి నీటి చేపలు తింటే ప్రతి రోజు సంవత్సరం పాటు సముద్రపు చేపలు తిన్నదానితో సమానం అవుతుందట. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డేవిడ్ ఆండ్రూస్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచి నీటి చేపల్లో ఎక్కువ మొత్తంలో PFAS, లేదా సల్ఫోనిక్ ఆసిడ్ వంటి టాక్సిన్స్ ఎక్కువ మొత్తంలో గుర్తించారు. వాటి వల్ల చేపలు తినడం ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
ఈ రకమైన మంచినీటి చేపలను అప్పుడప్పుడు తీసుకోవడం కూడా ప్రమాదకరమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరికీ కమర్షియల్ గా పెంచిన చేపలు అందుబాటులో ఉండకపోవచ్చు. చాలా మందికి ప్రోటీన్ రిసోర్స్ చేపలే. కానీ PFAS ఎక్స్పోజర్ గురించి అవగాహన లేకపోవడంతో స్థానికంగా దొరికిన చేపలు తినే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కూడా ఈ రసాయనాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అది వంట పాత్రల ద్వారా అయినా చేపల ద్వారా అయినా సరే శరీరంలో చేరడం ప్రమాదమని సూచిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి కమర్షియల్ గా పెంచిన చేపలు మాత్రమే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కమర్షియల్ గా పెంచిన చేపల్లో ఇలాంటి కాలుష్యాలు చేరే ప్రమాదం తక్కువ కనుక వీటి వల్ల కొంత మేలు జరగవచ్చేనేది ఈ స్టడీ సారాంశం. కనుక చేపలు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తిన్నా కూడా అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.