GOAT Hashtag Twitter: సోషల్‌ మీడియా వచ్చాక క్రికెటర్ల అభిమానుల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒకరి అభిమానులతో మరొకరు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్‌ ట్వీట్ల మోత మోగిస్తున్నారు. GOAT ఎమోజీలతో హ్యాష్‌ట్యాగులను ట్రెండింగ్‌ చేస్తున్నారు.


భారత క్రికెట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రెండు కళ్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు! టీమ్‌ఇండియాకు వారిద్దరూ ఎంతో కీలకం. ఒకరు ఓపెనింగ్‌లో వచ్చి విధ్వంసకర ఆరంభాలు ఇస్తారు. మరొకరు వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి వరకు నిలబడి మ్యాచులు గెలిపిస్తారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీరిద్దరూ చాలా సరదాగా ఉంటారని మాజీ క్రికెటర్లు అంటుంటారు. వారిద్దరూ పోటీపడరని, వారిమధ్య విభేదాలు లేవని పేర్కొంటారు. అయినప్పటికీ కొన్నేళ్లుగా ఛేజింగ్‌ కింగ్‌,హిట్‌మ్యాన్‌ అభిమానుల మధ్య పోటీ విపరీతంగా ఉంది. ఒకరి అభిమాన వర్గం మరో వర్గాన్ని పదేపదే కవ్విస్తుంటారు. మావాడు గొప్పంటే మా వాడు గొప్పని ట్వీట్లు చేస్తుంటారు. మరికొందరేమో అవతలి క్రికెటర్‌ను తక్కువ చేస్తూ కాస్త వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుంటారు.


బుధవారం ఉదయం నుంచి ట్విటర్లో ఒకటే మోత! పొద్దున విరాట్‌ కోహ్లీ GOAT అంటూ అతడి అభిమానులు గోట్‌ ఎమోజీతో ట్వీట్లు చేస్తున్నారు. గోట్‌ అంటే గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌! అంటే కోహ్లీనే గొప్పని అతడి అభిమానులు అంటున్నారు. ఇది తెలియడంతో వెంటనే రోహిత్ అభిమానులు రచ్చ మొదలు పెట్టారు. అవతలివర్గానికి పోటీగా రోహిత్‌ శర్మ GOAT అంటూ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కోహ్లీకోసం 90వేల మంది ట్వీట్‌ చేయగా ఆలస్యంగా మొదలు పెట్టినప్పటికీ రోహిత్‌ అభిమానులు 20వేల వరకు ట్వీట్లు చేశారు. ఇండియా మొత్తం చూసుకుంటే GOAT అనే ట్వీట్లు 1.61 లక్షలు అయ్యాయి. ఇక స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గోట్‌ అనే ట్రెండింగ్‌ మొదలైంది. ఇప్పటికే 40వేల మంది ట్వీటు చేశారు.