వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2020లో సీబీఐ విచారణ ప్రారంభించిన సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అన్ని చోట్లా వైఎస్ అవినాష్ రెడ్డి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
అవినాష్ రెడ్డి పైనే అనుమానాలు వ్యక్తం చేసిన అప్పటి సీఐ, డీఎస్పీ !
2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐ, డీఎస్పీగా ఉన్నఅధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అవి బయటకు వచ్చాయి. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. ఆయన తనకు వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని కేసు వద్దని బెదిరించారని చెప్పారు. వై.ఎస్.అవినాష్‌రెడ్డి, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.మనోహర్‌రెడ్డిలు ఆధారాలు తుడిచేశారన్నారు. ఇంటి తలుపులు వేసి గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బందినే అనుమతించారని సీబీఐకి తెలిపారు. సాక్ష్యాలు తుడిచేస్తూంటే వారించానని కానీ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెదిరించారన్నారు. అప్పటి డీఎస్పీ కూడా దాదాపుగా ఇదే చెప్పారు. వివేకా హత్య జరిగిన రోజున ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా ఇంటి సమీపంలో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకే బుధవారం సీబీఐ ఎఎస్పీ రాంసింగ్‌పై కేసు పెట్టారు.
సీబీఐ ఏఎస్పీ కేసుపై తదుపరి చర్యలొద్దన్న హైకోర్టు !
సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కడప పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తు అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులకు ఓ టెన్షన్ తీరిపోయినట్లయింది.
దస్తగిరి ఆరోపణలు - భరత్ యాదవ్ ప్రత్యారోపణలు
అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ ( Bharat Yadav ) భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదును సీబీఐకి ( CBI ) ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని .. అప్రూవర్‌గా మారిన తర్వాత భరత్ యాదవ్ తన ఇంటికి వస్తన్నారని అవినాష్ రెడ్డిని ( Avinash Reddy ) కలవాలంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తన భార్య బిడ్డలు అనాధలు కాకూడదనే అప్రూవర్ గా మారి సీబీఐ ముందు నిజాలను చెప్పానన్నాడు దస్తగిరి ( Dastagiri ) . అప్రూవర్ స్టేట్ మెంట్ ఇవ్వక ముందు కొన్ని బెదిరింపులు వచ్చాయని దస్తగిరి చెబుతున్నారు. దస్తగిరి చేసిన ఆరోపణలపై భరత్ యాదవ్ స్పందించారు. దస్తగిరి ని సీబీఐ వాళ్ళు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ఏమైనా చేసే వ్యక్తి దస్తగిరి అని అనవసరంగా అందరి పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శఇంచారు. దస్తగిరి ని ప్రలోభాలకు గురి చేశామని నిన్న ఇచ్చిన వాంగ్మూలం ( Statement ) పూర్తిగా అవాస్తవమన్నారు. మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని స్పష్టం చేశారు. రావాల్సిన డబ్బులు దస్తగిరి ని అడిగానని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కావాలనే దస్తగిరి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
కలకలం రేపిన భరత్ - దస్తగిరి మధ్య ఆడియో టేప్ !
ఈ వ్యవహారాలన్నీ ఇలా ఉండగనే తనతో దస్తగిరి మాట్లాడిన ఓ ఆడియోను భరత్ యాదవ్ విడుదల చేశాడు. దస్తగిరి ఆరోపణలేవీ నిజం కాదని, అతడిని ఎవరూ బెదిరించలేదని, అయినా అప్రూవర్ గా మారాక ఎందుకు బెదిరిస్తారని ప్రశ్నించాడు. మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని, లాయర్ ఓబుల్ రెడ్డిని కలవాలంటూ చెప్పలేదని, డబ్బుల కోసమే తమపై దస్తగిరి ఆరోపణలు చేస్తున్నాడని, డబ్బులు కావాలంటూ పదేపదే అడిగేవాడని పేర్కొన్నాడు. వైఎస్ కుటుంబ సభ్యులను వివేకా హత్యకేసులో కచ్చితంగా ఇరికిస్తానంటూ దస్తగిరి బెదిరించేవాడని, అందులో భాగంగానే ఇప్పుడు వారిని ఇరికించేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భరత్ యాదవ్ ఆరోపించాడు.