భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ ఘనత క్రికెట్లో అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అత్యధిక ఫాలోవర్లను దక్కించుకున్న తొలి ఆసియా సెలబ్రెటీగా నిలిచాడు కింగ్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 150 మిలియన్ల మార్కును అందుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీట్ అందుకున్న తొలి భారతీయుడిగా, ఆసియా వాసిగా, క్రికెటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2015 జూన్ 23న విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచాడు. అదే ఏడాది డిసెంబర్ 27 నాటికి కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్ చేరింది. ఇక అప్పటి నుంచి కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకీ దూసుకుపోతూనే ఉంది. 2020 ఫిబ్రవరి 18న 50 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న విరాట్ కోహ్లీ... ఈ మార్కును అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గానూ నిలిచాడు. ఆ తర్వాత 2021 మార్చి 3న 100 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న కోహ్లీ... ఆ తర్వాత ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు.
మొదటి 100 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేందుకు 562 రోజుల సమయం పడితే, ఆ తర్వాత 50 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేందుకు కేవలం 187 రోజులు మాత్రమే పట్టడం ఇక్కడ గమనార్హం. కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. జిమ్‌లో ప్రాక్టీస్‌కి సంబంధించిన, సహచర ఆటగాళ్లకు సరదాగా ఏదైనా ఛాలెంజ్ విసరడమో, భార్య అనుష్కతో కలిసిన ఫొటోలను, వీడియోలను కోహ్లీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. ఇంత యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టే 150 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించడం కోహ్లీకి సులువైంది.
ఇటీవల ట్విటర్లో యాక్టివ్‌గా లేనందుకు మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాకు ఉన్న బ్లూ టిక్ మార్క్‌ను ట్విటర్ తొలగించిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు ట్విటర్, ఫేస్‌బుక్‌లోనూ కోహ్లీ మంచి ఫాలోవర్లే ఉన్నారు. ట్విటర్లో 43.4 మిలియన్ల మంది ఉంటే ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది ఉన్నారు.
ప్రపంచంలో 150మిలియన్ల ఫాలోవర్లను పొందిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో 337 మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా, మెస్సీ (260), నెయ్‌మార్ (160) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక పోస్టు పెడితే రూ.5 కోట్లు అందుకుంటాడు. రొనాల్డో ఒక పోస్టుకి రూ.11.72కోట్లు తీసుకుంటాడని సమాచారం.