హుజురాబాద్‌ కాంగ్రెస్ టిక్కెట్ అంశంపై కాంగ్రెస్‌లో రగడ ప్రారంభమయింది. ఇప్పటికి హుజురాబాద్ ఉపఎన్నికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ వచ్చి అభిప్రాయాలు సేకరించారు. అయితే ఇక్కడే పార్టీ నేతలు ఎవరికి వారు పట్టింపులకు పోయారు. దీంతో టిక్కెట్ కోసం ధరఖాస్తు చేసుకోవాలంటూ పీసీసీ నాయకులు ప్రకటించారు. ఇది మరింత వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


Also Read : తెలంగాణ బీజేపీలో పాదయాత్ర జోష్


హుజురాబాద్‌లో బీజేపీకి ఈటల రాజేందర్ ఉన్నారు.. టీఆర్ఎస్‌కు గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. టీఆర్ఎస్‌కు అభ్యర్థిత్వం కోసం పోటీ పడే మరో పది మంది నేతలున్నారు. కానీ అసలు కాంగ్రెస్ కు నియోజకవర్గ స్థాయి నేతే లేకుండా పోయారు. కౌశిక్‌ రెడ్డితో పాటు ఆయన తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉంటారనుకున్న నేతలు కూడా గులాబీ కండువా కప్పేసుకున్నారు. అసలే  టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయ వాతావరణం మారుతూంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేసుకోలేకపోయారు. పక్క నియోజకవర్గాల నుంచి అయిన సరే తీసుకొచ్చి బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించి సీనియర్ నేతలు కొండా సురేఖతో మాట్లాడారు. ఆమె కొన్ని షరతుల మీద పోటీకి అంగీకరించారు. 


Also Read : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ది


కొండా సురేఖ నిజంగానే బలమైన అభ్యర్థి అవుతారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు ఉంది.  బీసీల్లోనూ పలుకుబడి ఉంది. ఆమె బలం.. బలగం.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను పక్కకు పోకుండా చూస్తాయని అందరూ అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అనుకున్నట్లుగా ఎవరూ చేయలేరు. ఆమె ఎంత గట్టి పోటీ ఇస్తారన్న విషయాన్ని పక్కన పెట్టి.. తమకు టిక్కెట్ కావాలంటూ రేసులోకి వచ్చేవారు.. ఆమెకు తప్ప ఎవరికైనా ఇవ్వాలని షరతులు పెట్టేవారు కోకొల్లలుగా ఉంటారు. అలాంటి వారు తెరపైకి రావడంతో టిక్కెట్ కోసం ధరఖాస్తు చేసుకోవాలనే ప్రతిపాదన పెట్టారు. ఐదో తేదీ వరకు గడువు ఇచ్చారు. 


Also Read : బుల్లెట్టు బండి పాటతో రోగిలో కదలిక తెచ్చిన నర్స్


అయితే అక్కడ పోటీ చేయాలనే ఆలోచనే మొదట్లో లేని కొండా సురేఖ దరఖాస్తు చేసుకోవాలని అనుకోవడం లేదు. పార్టీ కోరితే మాత్రమే పోటీ చేస్తానంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న దామోదర్ రాజనర్సింహ, భట్టి విక్రమార్కలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మంది ఇతర నేతలు పోటీకి సిద్ధపడుతున్నా పోటీ ఇచ్చే స్థాయి వారిది కాదు. అందుకే ఎలాగోలా పోటీకి ఒప్పుకున్న  కొండా సురేఖకు బీఫాం ఇవ్వకుండా .. అక్కడ లెక్కలేనంత మంది నేతలు ఉన్నట్లుగా దరఖాస్తులు పెట్టడంతో కొండా సురేఖ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఆమె పార్టీ అడిగితే పోటీ చేస్తారు లేకపోతే లేదు అన్న స్టాండ్‌కై ఫిక్సయిపోయారు.