తెలంగాణను అప్పుల పాలు చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అప్పులు చేసినా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి హరీష్ రావు వారికి కౌంటర్ ఇచ్చారు. అయితే వీరి సంవాదం రాజకీయం మాత్రమే. అసలు లెక్కలను నీతి ఆయోగ్ బయట పెట్టింది. ఈ లెక్కల్లో తెలంగాణ దేశంలోనే అత్యంత పురోగామి రాష్ట్రాల్లో ఒకటి. "అర్థనీతి" పేరుతో నీతి ఆయోగ్ మంగళవారం రోజున అంటే ఆగస్టు 31వ తేదీన ఓ రిపోర్ట్ ను ప్రకటించింది . ఇందులో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. 


జీఎస్డీపీ పరంగా ఏడో అతి పెద్ద రాష్ట్రం తెలంగాణ 
  
దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతి ఆర్థిక సంవత్సరం అంటే 2015-16 నుంచి 11 శాతానికిపైగా తెలంగాణ వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన దాని కంటే ఎక్కవ అని నీతిఆయోగ్ తన "అర్థనీతి" నివేదికలో స్పష్టం చేసింది. అటు సేవల రంగం.. ఇటు వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ మంచి పురోగతి కనబరుస్తోందని నివేదికలో లెక్కలు వివరించారు.


పారిశ్రామిక పురోగామి రాష్ట్రం తెలంగాణ 


పారిశ్రామిక పరంగా తెలంగాణ సాధిస్తున్న అభివృద్దిని "అర్థనీతి" నివేదికలో నీతిఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 34 ప్రత్యేక ఆర్థిక మండళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని.. 119 సెజ్‌లు వివిధ దశల్లో ఉన్నాయని.. వాటి పురోగతి చాలా గొప్పగా ఉందన్నారు.  విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తెలంగాణ ప్రభుత్వం వచేస్తున్న విభిన్న ప్రయత్నాలను అభినందించారు. ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ పాలసీని ఆవిష్కరణతో తెలంగాణప్రభుత్వం  ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌కు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.  ఇక ఐటీ రంగంలో స్థిరమైన వృద్ధి కనబరుస్తోందని నివేదికలో తెలిపింది.


దేశ ఫార్మా ఎగుమతుల్లో 20 శాతం హైదరాబాద్ నుంచే !


ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో తెలంగాణను నేషనల్‌ లీడర్‌గా నీతిఆయోగ్‌ అభివర్ణించింది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 4.63 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను తెలంగాణ నుంచి ఎగుమతి చేశారని ప్రశంసించారు. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్‌ వాటా 20 శాతంగా ఉందని లెక్క తేల్చింది.  తెలంగాణకు ఉన్న మౌలిక వసతుల గురించి "అర్థనీతి"లో గొప్పగా చెప్పారు. అద్భుత రహదారులు, రైల్వే సౌకర్యం ఉండటం ప్లస్ పాయింటన్నారు. 16 జాతీయ రహదారులు ..200లకుపైగా రైల్వేస్టేషన్లతో దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానమైన ఉన్నాయన్నారు.


తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయాలనే అర్థనీతి నివేదికలో నీతిఆయోగ్ చెప్పింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా అభివృద్ది చెందిందని దీని ద్వారా ఆర్థిక నిపుణులు అంచనాకు వస్తున్నారు.