దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు.. ఈరోజు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,965 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.28 కోట్లకు చేరింది. కోవిడ్ బాధితుల్లో నిన్న 460 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,39,020కి పెరిగింది. ఇక నిన్న ఒక్క రోజే 33,964 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3.19 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.51 శాతానికి చేరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.





 కేరళలోనే అత్యధికం.. 
కేరళలో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా ఇక్కడ 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 30,203 కేసులు కేరళలో నమోదు కావడం వ్యాధి తీవ్రతకు అద్దం పట్టేలా ఉంది. 


ఆగస్టులో వ్యాక్సినేషన్ రికార్డు.. 
కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆగస్టు నెలలో అత్యధిక వ్యాక్సినేషన్లు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న (ఆగస్టు 31) ఒక్క రోజే దేశవ్యాప్తంగా.. 1.3 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపింది. ఇక ఆగస్టు నెల మొత్తంలో 18.6 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. ఈ సంఖ్య జూన్ నెలలో 12 కోట్లు కాగా.. జూలైలో 13.5 కోట్లుగా ఉంది. ఆగస్టు 21 నుంచి 27 మధ్య వారం వ్యవధిలో 4.66 కోట్ల మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు చెప్పింది. అంటే సగటున రోజుకు 66.6 లక్షల టీకాలు అందించామని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ఓ వీడియోను ట్వీట్ చేశారు.





 Also Read: LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. 15 రోజుల్లో రూ.50 పెంపు.. సామాన్యులకు చుక్కలే..!


Also Read: Leave to Watch Web Series: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..