ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కోట్లాది సామాన్యులకు వంటగ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. ఇటీవల రూ.25 చొప్పున పెంచారు.. 15 రోజుల్లోనే మరోసారి రూ.25 పెంచేశారు. తాజాగా పెరిగిన ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచి అమలు కానున్నాయి. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ ధరలు సైతం భారీగానే పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.50 మేర ఎల్పీజీ ధరలు పెరగడం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.75 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.884.50 అయింది. తాజా ధరల ప్రకారం హైదరాబాద్‌లో ఎల్పీజీ ధర రూ.912 కు చేరింది. సబ్సిడీ లేని సిలిండర్లపై ఆగస్టు 17నే రూ.25 మేర పెంచడం తెలిసిందే. అంతకు ముందు జులై ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలు సవరించారు. అప్పుడు ఒక్కో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లపై రూ.25.50 మేర పెంచారు. ముంబైలో సిలిండర్ ధర రూ.884 అయింది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.886కు చేరింది. చెన్నైలో అయితే సిలిండర్ ధర రూ.900 గా ఉంది.
Also Read: Gold-Silver Price: రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి పయనం.. నేటి ధరలు ఇలా..
ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాని మోదీ ప్రభుత్వంలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఏడేళ్ల కాలంలో సిలిండర్ ధరలు అంతకంతకు పెరిగాయి. మార్చి 1, 2014లో రూ.410.50గా ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరలు నేడు రూ.884.50కు చేరాయి. ఏడేళ్లలో రెట్టింపు కన్న అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్ ధరలు చేరుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల సిలిండర్లు ఏడాదికి 12 మేర సబ్సిడీ అందిస్తోంది. సబ్సిడీ నగదు మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాకు జమచేయనుంది.
Also Read: Bank Holidays In September: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ఏఏ తేదీల్లో అంటే!
కాగా, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉండేది. సెప్టెంబర్ 1 నాటికి అది రూ.884.50కు చేరింది. ఫిబ్రవరిలో రూ.719, ఆపై 15వ తేదీన రూ.769 అయింది. మార్చి నెలలో రూ.794కు పెంచారు. మే, జూన్ నెలలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో ఎల్పీజీ రూ.884.50కు విక్రయిస్తారు. హైదరాబాద్‌లో తాజాగా పెరిగిన ధర రూ.912కు చేరింది. జిల్లాల్లో అంతకంటే అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్ విక్రయాలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 2.7 కోట్ల సిలిండర్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు.